- విలువైన నిర్మాణ కాలాన్ని వృథా చేశారు..
- ప్రాజెక్టు పూర్తికాకుండా జాతికి అంకితం పెద్ద మోసం
- ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడతాం.
- మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలి
- 2028లో రెండోదశ పూర్తి చేసే బాధ్యత నాదీ..
- ఇక మార్కాపురంలోనూ కృష్ణా పుష్కరాలు..
- దోర్నాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
- సంప్రదాయ పంచెకట్టుతో మురిపించిన ముఖ్యమంత్రి
మార్కాపురం (చైతన్య రథం): “2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. విలువైన నిర్మాణ కాలాన్ని వృథా చేశారు. నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొరగా చెల్లింపులు చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పడం, రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్లో ఉండగానే జాతికి అంకితం చేశామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే. ఫేక్ డ్రామాలు, సినిమా సెట్టింగులతో ప్రజల్ని, రైతుల్ని మోసం చేసిన వ్యక్తుల్ని ఏంచేయాలి. రెండు సొరంగాలు మొత్తం తిరిగానని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు. పనులు చేసేశామని చెప్పి బుకాయించటం. తప్పు. ఫేక్ మాటలు చెప్పే వ్యక్తుల్ని, మోసం చేసిన వారి గురించి ఈ ప్రాంత ప్రజలు నిలదీయాలి. గొడ్డలి పార్టీ హయాంలో సొరంగాల్లో టీబీఎం యంత్రం ఇరుక్కు పోవడంతో పనులు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సమస్యలను పరిష్కరించి పనులు పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జలాలను అందించింది. చరిత్రను ఎవరూ తిరగ రాయలేరు. ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడతాం. చెడును ఖండించాలి. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలి” అని సీఎం పిలుపునిచ్చారు.
మార్కాపురంలోనూ 2028 కృష్ణా పుష్కరాలు
వెలిగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ఫేజ్-2ను కూడా 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. మార్కా పురం జిల్లాను ఏర్పాటు చేశామని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్లో మార్కాపురాన్ని భాగం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే ఎన్డీఏ విధానమని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధి స్తామని స్పష్టం చేశారు.
దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తరలిస్తున్నామని, తదుపరి వంశధార వరకూ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం జరగాలని, మహానది గంగానదులను అనుసంధానిస్తే దేశం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని చెప్పారు. ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి భూగర్భజలంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలు నల్లమల సాగర్ వరకూ రావాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ఓట్లు అశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నామని.. ఎన్నికల కోసం కాదు.. ప్రజల జీవితాలను మార్చేందుకు, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
సంప్రదాయ పంచెకట్టుతో ఉల్లాసంగా..
తెలుగు సంప్రదాయ పంచె కట్టుతో వెలిగొండ సొంరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చారు. కృష్ణా జలాలు పసుపు కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులపై చల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫీడర్ కాలువ వద్ద కృష్ణమ్మ ప్రవాహానికి ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. సంప్రదాయ నృత్యాలతో కృష్ణా జలాలకు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బహిరంగ సభా వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంపుపై కండువా తిప్పుతూ రైతులకూ, ప్రజలకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. దివంగత పూలసుబ్బయ్య కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు పనిచేసిన అధికారులు, ఉద్యోగాలు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి నారాయణ, కందుల దుర్గేష్, కొలుసు పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.













