- ఏపీపీఎస్సీకి-డీఎస్సీకి తేడా తెలియని అజ్ఞాని జగన్
- 2024 ఎన్నికల కంటే 2శాతం అదనపు ఓట్లతో స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం
- వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది బాబే, త్వరలో ప్రారంభించేదీ ఆయనే
- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్
ఒంగోలు (చైతన్య రథం): జగన్‌కు పదోసారి సవాల్ చేస్తున్నా. టైమ్ డేట్ ఫిక్స్ చెయ్, పులివెందులకి అయినా, తాడేపల్లికి కొంపకు అయినా వస్తా, చర్చకు మీరు సిద్ధమా? డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు నాకు నీతులు చెబుతారా? అని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్రవారం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… డీఎస్సీపై 150 కేసులు వేయించినా, విజయవంతంగా పూర్తిచేసి టీచర్ ఉద్యోగాలు భర్తీచేశాం. అదీ మా చిత్తశుద్ధి. మీరు గతంలో నిర్వహించిన గ్రూప్-1 అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఈ సంవత్సరమేకాదు, రాబోయే మూడేళ్లు కూడా డిఎస్సీ నిర్వహిస్తాం. జగన్ వాళ్ల తాత వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరు. గొడ్డలిపార్టీ అధ్యక్షుడు జగన్‌కు నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి, పనులన్నీ పూర్తి చేస్తే క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏనాడైనా ఆయన నిజం చెప్పారా? ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి, కెసిఆర్ పరిపాలన చూశా. జగన్‌లాంటి చేతగాని నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు” అని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేస్తే సార్వత్రిక ఎన్నికలకంటే మరో 2శాతం మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధిస్తాం. కార్యకర్తలు మా చుట్టూకాకుండా ప్రజల చుట్టూ తిరగండి. పదవులు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి కార్యక్రమాలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. 4లక్షల మంది నాయకులను మై టీడీపీ యాప్ ద్వారా మానిటర్ చేస్తున్నాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోండి. ఒంగోలు పోతురాజు కాల్వ, నల్లకాలువల అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అవి చేశాక ప్రాధాన్యత క్రమంలో మిగిలినవి పనులు పూర్తి చేస్తాను. అభివృద్ధి, సంక్షేమం మన బాధ్యత. అయితే అది కేవలం పాస్‌పోర్టు లాంటిది మాత్రమే. కార్యకర్తలంతా ప్రజలవద్దకు వెళ్లి వారితో మమేకమవ్వండి. అదే మనకు శ్రీరామరక్ష. అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలకు దూరం అవుతారు” అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రం గాడిన పడాలంటే మరో 3సార్లు గెలవాలి
తెలుగుదేశం పార్టీది పెద్ద కుటుంబం. గత ఎన్నికల్లో జనసేన, బిజెపిలతో కలసి ప్రజల వద్దకు వెళ్లాం, 94శాతం సీట్లు గెలిచాం. మన ఐక్యత కొనసాగాలి. సీఎం, డిప్యూటీ సీఎంలకు క్లారిటీ ఉంది. కనీసం మరో మూడుసార్లు వరుసగా గెలిస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, దొంగకేసులు పెట్టారు. నాపై 23కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్, ఎస్సీ, ఎస్టీ కేసులు, ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ పెట్టారు. జగన్మోహన్రెడ్డి మాదిరి నేను కంచుకోటలో పోటీచేయలేదు. 40ఏళ్లలో గెలవని మంగళగిరిలో 91వేల మెజారిటీతో గెలిచా, అది నా సత్తా” అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
జగన్ చేసిన తప్పులకు వైసీపీ నేతల బలి
జగన్ చేసిన తప్పుడు పనులకు కొందరు వైసీపీ నాయకులు ఈరోజు జైలుకు వెళ్తున్నారు. ఇప్పుడు కులం కార్డు తీస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక బీసీ సోదరులకు 10శాతం రిజర్వేషన్ తగ్గించి, 17వేలమంది బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్నారు. తమ అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా చంపేశారు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్యను కిరాతంగా హత్య చేశారు. మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి, పరారయ్యాడు. తండ్రి.. తన కొడుకుకు బదులు మరొకరిని ప్రవేశపెట్టారు. చనిపోయిన నిరుపేద కుటుంబాన్ని కనీసం ఆదుకోలేదు. కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. లిక్కర్ రవాణాలో డబ్బులు కొట్టేశారు. అవినీతి సొమ్మును కోడలు అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఈడి గుర్తించింది. మధ్యలో పారిపోయారు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు. ఐబి, సిబిఐ పట్టుకొచ్చారు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం. మీరు చేసిన తప్పుల వల్లే జైలుకు వెళుతున్నారు. అధికారంలో ఉన్నపుడు కొల్లు, అచ్చెన్న, అయ్యన్నలపై తప్పుడు కేసులు బనాయించారు. ప్రస్తుత ఎంపీ విజయ్‌పై తప్పుడు కేసులుపెట్టి అరెస్టుకు ప్రయత్నించారు. వైసీపీ పాలనలో అరాచకాలను ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది” అని లోకేష్ పిలుపునిచ్చారు.
అహంకారం వద్దు…కలిసి పనిచేయండి
“పార్టీ నాయకులు, కార్యకర్తలకు అహంకారం వద్దు. కలసికట్టుగా పనిచేద్దాం. ఒంగోలులో అద్భుతమైన ఎమ్మెల్యే, ఎంపి ఉన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీమళ్లీ చంద్రబాబును సిఎంగా చేయాలి. చాలా కఠినమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. రూపాయికి 94పైసలు జీతాలకు సరిపోతోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలని చంద్రబాబు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ… “ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ 2.0 పథకాన్ని చేపట్టాం. కార్పొరేషన్‌కు తాజాగా రూ.78 కోట్లు మంజూరైంది. డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. డిజెఆర్ ట్రస్ట్ ద్వారా 6నుంచి 10వరకు 500మంది పేదపిల్లలను చదివిస్తున్నాం” అన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మద్దిపాటి వెంకట్రాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జడ్ శివప్రసాద్, ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.














