- ప్రభుత్వ నిర్వహణా కార్యక్రమాలపై విస్తృత ప్రచారం
- ప్రజా భాగస్వామ్యంతోనే సానుకూల ఫలితాలు
- రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి (చైతన్య రథం ప్రజలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు మరింత మెరుగుపరచాలని, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం సమీక్ష నిర్వహించారు. వెలిగొండ, అల్లూరి విమానాశ్రయ ప్రారంభోత్సవంలాంటి కార్యక్రమాలకు ప్రజా భాగస్వామ్యం పెద్దఎత్తున వచ్చిందని… దీనిని ఇతర అంశాలకూ వర్తింప చేయాలని సీఎం సూచించారు. ప్రత్యేకించి మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ సహా వివిధ అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తాను 20సార్లు పాల్గొన్నానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పరిశుభ్రత అంశాలపై ప్రజల్లో మరింత లోతైన అవగాహన. కల్పించాలన్నారు.
రాష్ట్రంలో శానిటేషన్ నిర్వహణపై ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో మెరుగ్గా శానిటేషన్ నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతీ నెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఆహ్వానించి హాస్టళ్లలో పరిస్థితులు, ఆహారం, తాగునీరు తదితర అంశాలపై వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్న క్యాంటీన్ల ద్వారా దాతలు అన్నార్తులకు సాయం అందించే అంశాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని లోటుపాట్లను సవరించుకోవాలని సీఎం నిర్దేశించారు. బాధ్యులకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో ర్యాంకులు ఇవ్వాలని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి కృష్ణా నదీ జలాలు రావటంతో ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమైందని.. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు.
ఆన్ లైన్ సేవలు మరింత విస్తృతం
అన్ని ప్రభుత్వ శాఖలూ ఆన్ లైన్లో సేవలు అందించాలని సమీకృత సేవల విధానం ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ సహా వివిధ విభాగాలు అన్ని ధృవపత్రాలనూ ఆన్ లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవేర్ ద్వారా రాష్ట్రంలో సాగు స్థితిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రైతులకు సూచనలు జారీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రకృతి సేద్యం పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటలు కాపాడుకోడానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. భూమిని నిరుపయోగంగా ఉంచకుండా సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. 5.7 లక్షల ఎకరాల్లో ప్రతీ ఎకరాను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.













