- భోగాపురం విమానాశ్రయంపై ముఖ్యమంత్రి వ్యాఖ్య
- ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రారంభం
- ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్పరెన్స్
అమరావతి (చైతన్య రథం): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేశామని, ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు పాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీలను కూడా ప్రారంభించుకోబోతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏపీకి లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుతోపాటు ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి ఖనిజాలు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తాయని అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టేకాఫ్ అయితే ఉత్తరాంధ్రతోపాటు యావత్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుగా మారుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులను, యజమానులను గౌరవిస్తూ ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే 9 రోజులపాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటా ప్రారంభోత్సవ వేడుక స్ఫూర్తి చేరాలని, ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అరకు కాఫీ, స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, కళారూపాలను కూడా ఈ సందర్భంగా ఘనంగా ప్రదర్శించాలని, విశాఖ ఎకనామిక్ రీజియన్ లో భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తుందో ప్రజలకు వివరించి చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, టూరిజం, లాజిస్టిక్స్, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున వచ్చే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.















