- రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ నిధులు విడుదల
- వంద బోట్లపైనుంచి కృతజ్ఞతలు చెప్పిన మత్స్యకారులు
- తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ భరోసా
- గంగపుత్రుల మనసు గెలిచిన లోకేష్ ఆతిథ్యం
అమరావతి (చైతన్య రథం): ఇదొక అరుదైన కృతజ్ఞత. మరో ఆత్మీయ ఆతిథ్యం. రెండింటి కలయికకు కృష్ణమ్మ వేదిక అయ్యింది. కూటమి ప్రభుత్వం రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ నిధులు విడుదల చేయడంతో కృష్ణానదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో సీఎం ఇంటి వరకూ వచ్చి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంలకు చెందిన మత్స్యకారులు సుమారు వంద బోట్లలో వచ్చారు. మత్స్యకారులను ఇంట్లోంచి చూసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అభివాదం చేస్తూనే.. రమ్మంటూ వారిని తన ఇంటికి ఆహ్వానించారు. మత్స్యకారులంతా సీఎం ఇంటికి వచ్చారు.
మత్స్యకారుల ప్రేమాభిమానాలు మరువలేం
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన మత్స్యకారులను అభినందించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ “గంగపుత్రులు.. అభిమాన మిత్రులు. యువగళం పాదయాత్ర జువ్వలదిన్నె చేరుకున్నప్పుడు మత్స్యకారుల పట్టుదల, ఐకమత్యం చూశాను. ఊరంతా ముగ్గులు వేశారు. నేను వచ్చేంతవరకూ ఆ ముగ్గులపై ఎవ్వరినీ నడవనీయలేదు. ఊరంతా శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులతో ఒక పండగలా నాకు స్వాగతం పలికారు. అంతా కలిసి ఒక్క మాట అనుకుంటే, దానిపై నిలబడతారు. మత్స్యకారుల నుంచి ఈ మాటపై నిలబడే తత్వం అందరం అలవర్చుకోవాలి.” అని కొనియాడారు.
మత్స్యకారుల పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు
“వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత ధ్వంసమైందో అందరూ చూశారు. ప్రతీ ఒక్కరూ బాధితులయ్యారు. కంపెనీలు తరలిపోయాయి. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తూనే, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. మత్స్యకారుల కష్టం నేను కళ్లారా చూశాను. ఇన్ని కష్టాలు పడినా, పిల్లలను బాగా చదివిస్తున్నారు. పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగానే జువ్వలదిన్నెలో డిఫెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేశాం.” అని లోకేష్ తెలియజేశారు. తమిళ జాలర్లు మన వైపు రాకుండా, వాళ్లకు మనకు మధ్య సర్వేలెన్స్ కోసం అటానమస్ పెట్రోలింగ్ బోటును సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు.
మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య అయినా ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టుకుని మత్స్యకారులందరితోనూ ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి.. ఫోటోలు దిగారు. తాము సీఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే.. మంత్రి లోకేష్ తమకు ఆత్మీయ ఆతిథ్యం అందించారని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.












