- పదేళ్ల నిర్వహణకు రూ.4,500 కోట్లతో టెండర్లు
- శాశ్వత సాగునీటి భద్రతే కూటమి లక్ష్యం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
జగ్గయ్యపేట (చైతన్య రథం): రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చి 8.2 లక్షల ఎకరాలకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పర్యటించారు. 15 కోట్లతో అక్కడి వేదాద్రి కంచల ఎత్తిపోతల పధకం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల రిపేర్లు, పదేళ్లపాటు నిర్వహణ పనులకు రూ.4,500 కోట్లతో టెండర్లు పిలుస్తున్నట్టు రామానాయుడు చెప్పారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగానికి 18 వేల కోట్లు అప్పుపెట్టి వెళ్లిపోయాడన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్, అన్నమయ్య తదితర ప్రాజెక్టుల విధ్వంసానికి జగన్ కారకుడయ్యాడన్నారు. నిర్వహణ పనులు కోసం ఐదేళ్లలో వైసీపీ రూ.200 కోట్లు కేటాయిస్తే.. కూటమి ప్రభుత్వ హయాంలో రెండేళ్లలోనే రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్టు రామానాయుడు చెప్పారు. రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల కింద 8.2 లక్షలు ఎకరాలు ఆయకట్టు ఉండగా.. గొడ్డలి పార్టీ విధ్వంసంవల్ల నాలుగు లక్షల ఎకరాలు కుచించుకుపోయిందన్నారు.
వైకాపా హయాంలో మరమ్మత్తులకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1023 లిఫ్ట్ స్కీములు ఉంటే కేవలం 166 మాత్రమే పని చేస్తున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2021నుండి వేదాద్రి కంచల లిఫ్ట్ స్కీం పనిచేయపోవటానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. రూ.15 కోట్లతో చేపడుతున్న ప్రస్తుత పునరుద్ధరణ పనులు పూర్తయితే జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించగలదన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో, వేదాద్రి కంచల లిఫ్ట్ స్కీం నిర్వహణకు రూ.5.36 కోట్లు ఖర్చు చేసి సాగునీరందించామని గుర్తు చేశారు. 2027 ఖరీఫ్ సీజన్‌నాటికి వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం విధ్వంస మైందనడానికి ఐడీసీనే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
“రాజధాని విషయంలో జగన్ మావిగన్ అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. పూటకో మాట, పేటకో మాట అన్న చందంగా ఉంది జనగ్ తీరు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని ఆహ్వానించి అధికారంలోకి వచ్చాక, మూడు రాజధానులంటూ మూడుముక్కలాటాడారు. తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధాని నగరాలుగా ఉంటూ లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయని గుర్తు చేస్తూ.. అలాగే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్‌గా ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన ప్రాజెక్టు ఉత్తమమైనది గుర్తు చేశారు. అమరావతి రాజధాని ఫలితంగా ఏటా లక్ష కోట్లు ఆదాయం వస్తుందన్నారు. ఈ లక్ష కోట్లతో 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఐడీసీఎండి తిరుమలరావు, కేడీసీ సీఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
















