అమరావతి (చైతన్య రథం): సింగపూర్‌లో మంత్రుల శిక్షణపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పెద్ద చర్చే సాగింది. క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలు ముగిశాక మంత్రులతో తాజా పరిణామాలపై చర్చించారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. ‘మనం పాలనలో శిక్షణ కోసం, సంపద పెంపుకోసం వెళ్లాం. సింగపూర్ వాళ్లు ఎవరికీ ఇవ్వని అవకాశం మనకు ఇచ్చారు. దీనిపై కూడా వైసీపీ వాళ్లు రాద్ధాంతం చేయడాన్ని మనం ఖండించాలి. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలి. ఇతర దేశాల్లో చదరపు అడుగు ఎంతకు నిర్మిస్తున్నారు అనేది మనం తెలుసుకుని అసలు నిజాలు చెప్పాలి. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఇదే టెక్నాలజీతో చేసే నిర్మాణాలకంటే మనం తక్కువ ఖర్చుతో చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు విశ్లేషణాత్మకంగా చర్చించారు.
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
అసెంబ్లీ, సచివాలయం భవనాలు, హైకోర్టు ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా చేస్తున్నారని.. అందరూ వచ్చి చూసేలా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ధరల విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రతిపక్షం చేసే విమర్శలకు సరైన సమాధానమివ్వాలన్నారు. ‘తొలుత ఇంధన కొరత వచ్చింది… మనం వెంటనే స్పందించాం. ఇప్పుడు పెట్రోల్ బంకులలో సాధారణ పరిస్థితి ఉంది’ అని అన్నారు. ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు వెంటనే స్పందించాలన్నారు. సింగపూర్‌వెళ్లి వచ్చిన మంత్రులు.. అక్కడ నేర్చుకున్న విషయాలను మిగతా మంత్రులకు వివరించే అంశంపై కూడా త్వరలోనే సమావేశం అవుదామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏఐ, ఐటీపై పరిజ్ఞానం పెంచుకోవాలి..
ఒకస్థాయి ఉద్యోగుల నియామకాల్లో ఏఐ, ఐటీ తప్పనిసరి చేయాలని సీఎం అన్నారు. మంత్రులు కూడా ఏఐ, ఐటీపై పరిజ్ఞానం పెంచుకోకుంటే వెనుకబడిపోతారని హెచ్చరించారు. జలాధార, జలహారతి కార్యక్రమాల్లో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని మంత్రి రామానాయుడికి సీఎం సూచించారు. పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతలపై మంత్రులు పర్యవేక్షించాలని.. ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీరు, ముందస్తు చర్యలను మంత్రులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
సింగపూర్ అభివృద్ధి ఓ స్ఫూర్తిదాయకం..
సూర్యఘర్ లక్ష్యాల కోసం ఇంకా బాగా పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికి సీఎం సూచించారు. సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యాలను సీఎంకు మంత్రి వివరించారు. సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు అక్కడి అధ్యయనాలపై వ్యక్తిగతంగా నివేదికలు ఇవ్వాలన్నారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరు ఓ స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు రావటం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగమని చంద్రబాబు ప్రశంసించారు. గూగుల్ని రాష్ట్రానికి తెచ్చే క్రమంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలను గుర్తు చేసుకుంటూ.. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కలిసి ఒప్పించిన తీరును చర్చించారు.













