- హత్యా రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్
- వివేకా హత్య నుంచి పెద్ద దస్తగిరి హత్య వరకు అంతా ఒకే ప్లాన్
- రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీ శ్రేణులనే బలి చేస్తున్న జగన్ రెడ్డి
- నిత్యానంద రెడ్డికి అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే పెద్ద దస్తగిరి దారుణ హత్య
- అధికారం కోసం తల్లి, చెల్లి, బాబాయ్‌లను సైతం కాదనుకునే నైజం జగన్ ది
- 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తగ్గని ‘నరుకుతాం.. చంపేస్తాం’ అనే హెచ్చరికలు
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్రంలో అధికారం కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగించే ఒక ‘విష సంస్కృతిని’ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే గొడ్డలిపోటుతో హతమార్చిన చరిత్ర ఆ పార్టీదని, అదే బాటలో నేడు కార్యకర్తల ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మొదలైన ‘గొడ్డలి పోటు’ రాజకీయం నేడు క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు పాకింది. కడపలో పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించిన కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకున్నారు.
జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ డిప్యూటీ మేయర్ అయిన నిత్యానంద రెడ్డి తన రూ.100 కోట్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనే ఏకైక కారణంతో దస్తగిరిని అంతమొందించడం దారుణం. వివేకా హత్య జరిగినప్పుడు రక్తపు మడుగులో ఉన్న బాబాయి మృతదేహాన్ని గుండెపోటుగా చిత్రీకరించి, సాక్ష్యాలను ఏ రకంగా అయితే తుడిచిపెట్టారో.. నేడు దస్తగిరి హత్య విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. హత్య చేసిన నిందితులు నేరుగా వెళ్లి నిత్యానంద రెడ్డిని కలవడం చూస్తుంటే, ఈ హత్యల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హత్య రాజకీయాలకు, గొడ్డలి సంస్కృతికి వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు రక్షణ లేకపోగా, అడ్డు వస్తే సొంత మనుషులనే చంపేసే స్థాయికి ఆ పార్టీ నేతలు దిగజారిపోయారు’ అని వ్యాఖ్యానించారు.
తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది రాజకీయ ఆలోచన కాదు… పక్కా ‘క్రిమినల్ మైండ’ అని రాష్ట్ర మంత్రి తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాగుతున్న హత్యాయత్నాలు, దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో జగన్ పరామర్శ యాత్రలో జరిగిన ఘటనను గుర్తు చేసి మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “సాధారణంగా రోడ్డుపై ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదానికి గురైతేనే మనం కారు ఆపి మానవత్వంతో ఆసుపత్రికి పంపిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ చక్రాల కింద సొంత కార్యకర్త నలిగి చనిపోతుంటే, కారు కింద నిమ్మకాయ నలిగినట్లుగా భావించి.. ఆ శవాన్ని పక్కన పొదల్లోకి విసిరేసి వెళ్లారంటే ఆయనలో మానవత్వం ఉందా?” అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం, డబ్బు తప్ప మరేమీ కనిపించవు. తన ప్రయోజనం కోసం బాబాయ్ అయినా, చెల్లి అయినా, తల్లి అయినా, చివరికి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే కార్యకర్త అయినా ఆయన దృష్టిలో కేవలం ఒక వస్తువు మాత్రమే. అడ్డు వస్తే ఎవరినైనా తొలగించుకుంటూ పోయే ‘గొడ్డలి సంస్కృతి’ని రాష్ట్రం చూస్తోందని విమర్శించారు.
‘నాడు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి ఆ సాక్ష్యాలను తుడిచిపెట్టి గుండెపోటుగా చిత్రీకరించారు. ఆ ‘నారాసుర రక్త చరిత్ర’ను చంద్రబాబు మీదకు నెట్టడానికి జగన్ ఎంతగా ప్రయత్నించారో ప్రజలందరూ చూశారు. జగన్ దృష్టిలో తన సొంత చిన్నాన్న అయినా, తల్లి అయినా, చెల్లి అయినా కేవలం రాజకీయ పావులే తప్ప మరేమీ కాదు. 2018లో ‘కోడికత్తి’ డ్రామాతో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన జగన్, ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఒక పేద దళిత బిడ్డ జీవితాన్ని ఎలా బలిపెట్టారో మనం చూశాం. తన గెలుపు కోసం ఒక సామాన్యుడి జీవితాన్ని నాశనం చేయడమే జగన్ మార్క్ రాజకీయం. వైసీపీ కార్యకర్తలు గమనించాలి.. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహం తీర్చుకోవడానికి కేవలం ‘టూల్స’ (పనిముట్లు) లాగా మాత్రమే వాడుకుంటారు. అవసరం తీరాక పెద్ద దస్తగిరి లాగా మిమ్మల్ని గాలికి వదిలేస్తారు, ఆస్తుల కోసం మీ ప్రాణాలనే బలి తీసుకుంటారు.’ అన్నారు.
చిచ్చు పెట్టాలని చూస్తున్నారు…
2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఓడించినా జగన్‌లో మార్పు రాలేదు. తనను ఓడించారనే కక్షతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదని, ప్రజలు సుఖంగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు. “చంపేస్తాం, నరికేస్తాం, అంతు చూస్తాం” అనే మాటలు తప్ప ఆయన నోటి నుంచి ఒక నిర్మాణాత్మకమైన మాట రావట్లేదు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ చిచ్చు పెట్టాలని, అభివృద్ధికి అడ్డుపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తనను గద్దె దించారన్న కోపంతో, రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టాలని కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, తన రూ. 100 కోట్ల సెటిల్మెంట్లకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో కార్యకర్త దస్తగిరిని చంపించారంటే.. ఆ పార్టీలో ప్రాణాల కంటే పైసలకే ఎక్కువ విలువ ఉందని అర్థమవుతోంది. తాడేపల్లితో ఉన్న ఆర్థిక అనుబంధం వల్లే ఇటువంటి కబ్జాలు, సెటిల్మెంట్లు యథేచ్ఛగా సాగుతున్నాయని’ మంత్రి విమర్శించారు.
సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ ఓడిపోతే.. “మేము తప్పులు సరిదిద్దుకుంటాం, మళ్లీ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తాం” అని ప్రజలకు చెపుతుంది. కానీ జగన్ రెడ్డి పార్టీ మాత్రం “నరుకుతాం, తొక్కేస్తాం, అంతు చూస్తాం” అంటూ వీధిరౌడీల్లా మాట్లాడుతోంది. ఇటువంటి హింసాత్మక భావజాలం ఉన్న పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అర్హతే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తన క్రిమినల్ మైండ్‌తో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం, ఉన్న పనులను పడగొట్టడం, ప్రజలను బెదిరించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ‘గొడ్డలి పార్టీ’గా, ‘రప్ప రప్ప’ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రశాంతత వర్ధిల్లాలంటే ఇటువంటి హింసను ప్రోత్సహించే నాయకత్వానికి రాష్ట్రంలో చోటుండకూడదని మంత్రి పిలుపునిచ్చారు. డబ్బు కోసం, అధికారం కోసం సొంత మనుషులనే మింగేసే ఇటువంటి విష సంస్కృతిని అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. “జగన్ రెడ్డీ… మీ నేతలు చేసే ప్రతి కబ్జా, ప్రతి సెటిల్మెంట్ వాటా తాడేపల్లికి చేరుతున్న మాట వాస్తవం కాదా? మీ ధనదాహానికి అడ్డు తగిలితే సొంత కార్యకర్తలనైనా నిర్దాక్షణంగా చంపేస్తారా? ఈ ‘రౌడీ రాజకీయం’ ఇకపై సాగదు. మీ గొడ్డలి సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాశ్వతంగా సమాధి కట్టడం ఖాయమని రామానాయుడు హెచ్చరించారు.














