- బ్యాలెట్ బాక్స్ లాక్కెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి ముఠాపై ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు
- 19 కేసులున్న లేళ్ల అప్పిరెడ్డి అమాయకుడా?.. వైఎస్ జగన్ను నిలదీసిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య
- ఓటమి భయంతోనే జగన్ కుట్రలు, అల్లర్లు
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న లేళ్ల అప్పిరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
అమరావతి (చైతన్యరథం): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వెంగళాయపాలెం పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ వర్గీయులు తీవ్ర హింసాకాండకు పాల్పడి, బ్యాలెట్ బాక్సును బలవంతంగా లాక్కెళ్లారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు, అక్రమాలు ఘటన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున, ఐజీ రాజకుమారిలకు తెలుగుదేశం పార్టీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి, వారి అనుచరులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ మంత్రి, ఏపీ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పీతల సుజాత, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబులతో కూడిన బృందం ఎస్ఈసీకి సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది.
ఎన్నికలు అడ్డుకోవాలని అల్లర్లు సృష్టిస్తున్న వైసీపీ రౌడీమూకలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల నుంచి మద్దతు పూర్తిగా కరువైందని తేలిపోవడంతో, ఎలాగైనా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలనే దురుద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రలు, దురాలోచనలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో ప్రజలు వైఎస్సార్సీపీని పూర్తిగా తిరస్కరించారని, ప్రస్తుతం 2026లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటర్లు అదే ఉత్సాహంతో కూటమికి అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. ఫలితాలు వస్తే తమ బండారం బయటపడుతుందని, ప్రజా మద్దతు ఏమాత్రం లేదన్న వాస్తవం జగన్కు నిద్రలేకుండా చేస్తోందని విమర్శించారు. అందుకే మొదటి రోజు నుంచే ఎక్కడెక్కడ కార్లు తగలబెట్టాలి, ఎక్కడ అల్లర్లు సృష్టించాలనే కుట్రలకు ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని అమాయకుడంటూ జగన్ మోహన్ రెడ్డి వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని రామయ్య దుయ్యబట్టారు. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉందని, గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన అధికారి “జిల్లాలో కనిపిస్తే కాల్చిపారేస్తా” అని హెచ్చరించినంతటి హిస్టరీ ఆయనకు ఉందని గుర్తుచేశారు.
పోలీస్ రిమాండ్ రిపోర్టు ప్రకారం 2018 నుంచి ఇప్పటివరకు అప్పిరెడ్డిపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, అటువంటి అలవాటుపడిన నేరస్థుడిని (హ్యాబిచువల్ అఫెండర్) ఏ రకంగా అమాయకుడని పిలుస్తారని నిలదీశారు. దీనిపై తనతో సాక్షి ఛానల్లోనైనా ముఖాముఖి చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సును రోడ్డుపైకి తెచ్చి, ఓట్లు నిండిన బాక్సు పక్కనే పోలింగ్ అధికారి చొక్కా పట్టుకుని నిర్బంధించిన ఫోటో ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేశామని తెలిపారు. ఒక ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని దౌర్జన్యం చేస్తూ, రోడ్డుపై కూర్చున్న వ్యక్తి అమాయకుడవుతాడా అని ప్రశ్నించారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే లేళ్ల అప్పిరెడ్డిని వెంటనే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ యాక్ట్) కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ చేస్తున్న అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా 47 నియోజకవర్గాలు, 19 పార్లమెంట్ పరిధులకు సంబంధించి మొత్తం 82 ఫిర్యాదులను ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పించామని తెలిపారు.
కేవలం పులివెందుల నియోజకవర్గంలోనే 15 ఫిర్యాదులు ఇచ్చామని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ హెలికాప్టర్ చక్కర్లు, 15 కాన్వాయ్ కార్లతో పురవీధుల్లో పచార్లు చేసి ఆర్వో ఆఫీస్ ఎదుట బైఠాయించినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏ1 ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించారు. పోలింగ్ బూతుల్లోకి తమ ఏజెంట్లను రానివ్వలేదని వైసీపీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు. ఎక్కడ రానివ్వలేదో, ఏ అధికారికి ఫిర్యాదు చేశారో చెప్పే దమ్ము వారికి ఉందా అని ప్రశ్నించారు. గన్నవరం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా వందలాది స్థానాల్లో ఫలితాలు వస్తుంటే, ఏజెంట్లు లేకుండానే కౌంటింగ్ జరిగిందా అని నిలదీశారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చట్టాలను, నైతిక విలువలను తుంగలో తొక్కి మాట్లాడటం సిగ్గుచేటని, ఈ హింసాత్మక ఘటనలు, ఆధారాలపై తక్షణమే విచారణ జరిపి చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరినట్లు వర్ల రామయ్య స్పష్టం చేశారు.




















