- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం
- సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు
అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసికట్టుగా చేస్తున్న నిరంతర కృషికి ప్రజలు జై కొట్టారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనను ప్రజలు ‘హాఫ్ ఇయర్లీ పరీక్షలు’గా భావించి అపూర్వ తీర్పునిచ్చారు. పట్టణ సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించారు. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను చావుదెబ్బ కొట్టారు. కోస్తాంధ్రలో కూటమి ప్రభంజనం సృష్టించింది. అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీ లను క్లీన్ స్వీప్ చేసింది. అత్యధిక డివిజన్లు, వార్డుల్లో కూటమి విజయఢంకా మోగించింది. వైసీపీ కనీస పోటీ ఇవ్వలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ అధినేత జగన్ అడ్డా అయిన కడప జిల్లాలో అధిక మున్సిపాలిటీలను టీడీపీ, బీజేపీ కైవసం చేసుకున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. జగన్ పిన్ని వైఎస్ ప్రమీలపై టీడీపీ అభ్యర్థి గీతాకుమారి 13,875 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలోని 90శాతం పైగా స్థానాల్లో ఘన విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


















