1996 మార్చి 5న.. చంద్రబాబు నాయుడు శంకుస్థాపనతో పడిన తొలి అడుగు.. 2026 ఆగస్టు 31న చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఘట్టంతో సాకారం కానున్న కల. కాని `మధ్యలో మూడు దశాబ్దాల నిరీక్షణ. కేంద్ర అనుమతులనుంచి నిధుల కొరత వరకు.. వెలిగొండ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. 1996 మార్చి 5న శంకుస్థాపన జరిగినా, ప్రాజెక్టు పనులు వెంటనే వేగం అందుకోలేదు. శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ ప్రాంతంనుంచి కృష్ణా వరద జలాలను మళ్లించే ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు తప్పనిసరి. నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోకి ప్రాజెక్టు ప్రాంతం రావడంతో, వన్యప్రాణి సంరక్షణ అంశాలపై సుదీర్ఘ సమీక్షలు, అనుమతుల ప్రక్రియ ఏళ్ల తరబడి సాగింది. ఇది తొలి దశలో ప్రాజెక్టు మందగమనానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
2001లో సాంకేతిక సలహా కమిటీ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించింది. తర్వాత సొరంగాల తవ్వకం వంటి క్లిష్టమైన పనులను విదేశీ సంస్థకు అప్పగించే ప్రయత్నం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రాజెక్టు మరో మూడేళ్లు మౌనంగా ఉండిపోయింది. 2004లో ప్రాజెక్టుకు మరోసారి శంకుస్థాపన చేశారు. 2005లో ప్రభుత్వం అధికారికంగా ప్రాజెక్టును చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే 2006లో వాస్తవిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. అంటే తొలి శంకుస్థాపన నుంచి వాస్తవ నిర్మాణం మొదలవడానికే పదేళ్లు పట్టిందన్నమాట. ఈ పదేళ్ల కాలం అనుమతులు, సాంకేతిక అధ్యయనాలు, ప్రణాళికల మార్పులతోనే గడిచిపోయింది.
నల్లమల కొండలు: అసలైన సవాలు
నిర్మాణం మొదలైన తర్వాత ఎదురైన అతిపెద్ద సవాలు నల్లమల కొండల మధ్య సొరంగాల తవ్వకం. సుమారు 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలను కొండలగుండా తవ్వాల్సి రావడం. ఇది దేశంలోనే అత్యంత క్లిష్టమైన నీటిపారుదల నిర్మాణాల్లో ఒకటిగా మారడానికి కారణమైంది. రాతి పొరల్లో వైవిధ్యం, భూగర్భ జలాల ఊటలు, పరికరాల సాంకేతిక సమస్యలు తవ్వకం వేగాన్ని తరచూ తగ్గించాయి. దీనికితోడు నిధుల కొరత, కాంట్రాక్టర్ల మార్పులు, రాజకీయ అస్థిరతవంటి అంశాలు తోడయ్యాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు నీటి వనరుల ప్రాధాన్యత మరింత పెరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2018నాటికి మొదటి సొరంగం పనుల్లో గణనీయమైన పురోగతి నమోదైంది. అయితే అప్పటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని అందించే స్థాయికి చేరుకోలేదు.
2024-25: కీలక మలుపు
తదుపరి కాలంలో సొరంగం పనులు మరింత ముందుకు సాగాయి. మొదటి సొరంగం పూర్తి కాగా, రెండో సొరంగం తవ్వకం కూడా పూర్తయ్యే దశకు చేరింది. 2024-25 నాటికి రెండు సొరంగాలకు సంబంధించిన కీలక పనులు పూర్తయ్యాయి. అయితే సొరంగాలు పూర్తవడం మాత్రమే సరిపోదు. వాటినుంచి నల్లమలసాగర్‌కు నీరు చేరేందుకు హెడ్ రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, ఫీడర్ కెనాల్, మెయిన్ కెనాల్స్, లైనింగ్‌వంటి అనేక అనుబంధ పనులు కూడా పూర్తిచేయాల్సి వచ్చింది.
కూటమి ప్రభుత్వం: శరవేగంతో ముందడుగు
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలిగొండను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. సాగునీటి ప్రాజెక్టులపై అపారమైన అనుభవున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేశారు. స్వయంగా పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహించారు. కచ్చితమైన గడువులను నిర్దేశించారు. ఆయన సంకల్పానికి మంత్రి నిమ్మల రామానాయుడు చిత్తశుద్ధి తోడైంది. ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండి, సొరంగంలోకి స్వయంగా వెళ్లి పనుల పురోగతిని పర్యవేక్షించిన సందర్భాలు కోకొల్లలు. 2026 ఫిబ్రవరిలో మార్కాపురం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి తొలి దశను జూలైనాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీరు అందించాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. అదే సందర్భంగా రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. కేవలం ఐదు నెలల్లోనే ఫీడర్ కెనాల్ నిర్మాణం పూర్తి కావడం విశేషం. తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ, సుంకేసుల రెగ్యులేటర్ల పనులను ఆగస్టు 15నాటికి ముగించాలని కచ్చితమైన డెడ్‌లైన్ విధించారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాల ఖర్చు తేడా
ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ.9,081 కోట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే మునుపటి (వైసీపీ) ప్రభుత్వం హయాంలో వెలిగొండకు కేవలం రూ.980 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి భిన్నంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలోనే రూ.2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేసినట్టు ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. పనుల వేగవంతానికి ప్రత్యేకంగా రూ.3,000 కోట్లు కేటాయించడంతోపాటు, ఫీడర్ కెనాల్ నిర్మాణానికి రూ.460 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేశారు.
అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి తన ప్రభుత్వం ఇప్పటివరకు నీటిపారుదల ప్రాజెక్టులపై రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2021నాటికే పూర్తి కావాల్సి ఉండగా, వైసీపీ పాలకుల నిర్లక్ష్య వైఖరి.. కమిషన్లకు పడిన కక్కుర్తి.. కరవు గడ్డకు కృష్ణమ్మను పారించాలన్న సంకల్ప లోపం.. వెరసి వెలిగొండ దిగాలుగా ఉండిపోయిందన్నది బహిరంగ రహస్యం.
ఎల్‌నినో సవాలు మధ్యే పట్టుదల
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 50 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగడం మామÖలు విషయం కాదు. వెలిగొండ కలను తానే సాకారం చేస్తానన్న ఎన్నికల హామీ.. నిర్ధుష్ట సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్న చంద్రబాబు కృతనిశ్చయం.. ఫస్ట్‌ఫేజ్‌ను ప్రారంభించుకోవడానికి రంగం సిద్ధమైంది.
మూడు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ప్రభుత్వాలు, అనేక సవాళ్లు, అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. కరవు ప్రాంతానికి కృష్ణమ్మను పారిస్తానని ప్రజలకు మాటిచ్చి శంకుస్థాపనకు సాహసించిన విజనరీ లీడరే.. ఇప్పుడు ప్రాజెక్టును పూర్తిచేసి చరిత్రలో శాశ్వత కీర్తి ప్రతిష్టను సాధించుకున్నారు. నీటికోసం అలమటిస్తున్న కరవు గడ్డపై కృష్ణమ్మను పరుగులు పెట్టించేందుకు.. లక్షలాది దాహార్తి ప్రాణాలకు ఉపశమనం కలిగించి.. బీడుపడిన భూములపై పచ్చదనపు సౌభాగ్యాన్ని పండించేందుకు `ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ కలను సాకారం చేయబోతున్నారు.
(రేపటి కథనంలో: నల్లమల కొండలగుండా 18.8 కిలోమీటర్ల సొరంగాలు ఎలా తవ్వారు? అమెరికా, జర్మనీ నుంచి తెప్పించిన టీబీఎం యంత్రాల కథ, టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా జరిగిన నిర్మాణ విశేషాలు)
















