నూజివీడు (చైతన్య రథం): వ్యవసాయంలో సాంకేతికత, ఆవిష్కరణలు, స్వదేశీ విత్తనాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు దేశాన్ని ఆహారరంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రేనిపాడులోని గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థలో సోమవారం భారతదేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన నాన్-జీఎంఓ, హై-ఎక్స్‌పాన్షన్ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్‌నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. ‘నేను తెలుగు అర్థం చేసుకోగలను.. కానీ మాట్లాడలేను’ అంటూ సభికులను ఆకట్టుకున్నారు. రెండు నెలల క్రితం తమిళ పత్రికలో గౌర్మెట్ సంస్థ ఎండీ పట్టాభి సక్సెస్ స్టోరీని చదివానని తెలిపారు. ఒకే ఉత్పత్తికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంతోపాటు రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్న ఆయన ప్రయత్నాలను అభినందించారు. ఒక చిన్న ఆలోచన పెద్ద లక్ష్యంగా మారాలని, స్వదేశీ పరిజ్ఞానం, స్థానిక రైతుల శ్రమతో ప్రపంచ మార్కెట్లలో భారత్ పోటీ పడేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సాంకేతికత, ఆవిష్కరణలు, స్వదేశీ విత్తనాభివృద్ధి భారత వ్యవసాయాన్ని కొత్త దిశలో నడిపించగలవని పేర్కొన్నారు.
రైతులే దేశానికి వెన్నెముక
రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న రాధాకృష్ణన్.. భారత నాగరికత, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి ఎంతో కీలక స్థానం ఉందన్నారు. 140 కోట్లకు పైగా జనాభావున్న భారత్ ఆహార భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడకూడదని స్పష్టం చేశారు. దేశ అవసరాలను తీర్చేస్థాయిలో ఉత్పత్తి పెంచడంతోపాటు ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రైతు నాటే ప్రతి విత్తనం భవిష్యత్తులో మరింత బలమైన, స్వయం సమృద్ధి సాధించిన, అభివృద్ధి చెందిన భారతానికి బీజంగా మారాలని ఆకాంక్షించారు.
భారత్ ఇంతకాలం అధిక నాణ్యత కలిగిన పాప్‌కార్న్ మొక్కజొన్న కోసం విదేశీ హైబ్రిడ్ సాంకేతికతపై ఆధారపడిందని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ హైబ్రిడ్ ఆ దిగుమతి ఆధారితతను తగ్గించడంతో పాటు విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో దోహదపడుతుందని అన్నారు. భారత నేలపై అభివృద్ధి చేసిన విత్తనంతో ప్రపంచ మార్కెట్లను అందుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
40 వేల ఎకరాల్లో 17,500 మంది రైతులు
గౌర్మెట్ పాప్‌కార్నికా ఆధ్వర్యంలో ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 మందికిపైగా రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని రాధాకృష్ణన్ తెలిపారు. ఈ రైతు కుటుంబాలు ఈ సాగు కోసం రుణాలపై ఆధారపడకుండా పంటను సాగు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు మార్కెట్ అనుసంధానం, నమ్మకమైన కొనుగోలు వ్యవస్థ, విలువ ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమని ఆయన సందేశం స్పష్టం చేసింది.
రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, నమో డ్రోన్ దీదీవంటి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు డ్రోన్లను అద్దెకు అందించే కార్యక్రమం కోసం మహిళా సంఘాలకు కేంద్రం రూ.1,200 కోట్లను కేటాయించిందని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతికత వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
పండుగలన్నీ రైతు చుట్టూనే..
జనవరి 14న దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పంటల పండుగను జరుపుకుంటామని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో లోహిరి, అసోంలో బిహుగా పంట పండుగలను నిర్వహిస్తారని చెప్పారు. భారతీయ సంస్కృతిలో వ్యవసాయం, రైతుకు ఉన్న ప్రాధాన్యతను ఈ పండుగలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది దేవుడి కృపతో అవసరమైన వర్షాలు కురుస్తాయని, వర్షాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. దక్షిణ భారత నదుల అనుసంధానానికి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మహానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం కలగానే మిగిలిపోదని.. కొంత ఆలస్యం జరిగినా అది వాస్తవ రూపం దాలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పాప్‌కార్న్ దిగుమతులనుంచి ఎగుమతుల దిశగా..
అమెరికానుంచి పాప్‌కార్న్ మొక్కజొన్నను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి బయటపడి, భవిష్యత్తులో అదే దేశానికి భారత్ పాప్‌కార్న్ మొక్కజొన్నను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. రైతు పంటను కేవలం ముడి సరుకుగా కాకుండా విత్తనం నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వరకు విలువను పెంచే వ్యవస్థగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ముసునూరు కార్యక్రమం చాటిచెప్పిందన్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన నాన్-జీఎంఓ హై-ఎక్స్‌పాన్షన్ హైబ్రిడ్ విత్తనం ఈ ప్రయాణంలో మరో కీలక అడుగని పేర్కొన్నారు. ‘ప్రతి విత్తనం.. బలమైన, స్వయం సమృద్ధి సాధించిన భారతానికి బీజం కావాలి’ అన్న సందేశంతో ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పాప్‌కార్న్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఆయన సత్కరించారు.
















