- అవగాహన, గైడెన్స్ కోసం మిషన్ మోడ్‌లో కార్యక్రమం: లోకేష్
- 935 పాఠశాలల్లో 4.47 లక్షల మందికి యోగా శిక్షణ
- టెన్త్, ఇంటర్లో 90 శాతం ఫలితాలే లక్ష్యమని దిశానిర్దేశం
- విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
అమరావతి (చైతన్య రథం): విద్యార్థుల్లో మానసిక వత్తిడి నివారించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవేర్నెస్, ఇనిస్టిట్యూషనల్ సపోర్ట్ సిస్టమ్, గైడెన్స్ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్‌లో ప్రారంభించాలన్నారు. దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు స్పందిస్తూ విద్యార్థుల మెంటల్ హెల్త్ కొరకు కేర్ ఏపీ టూల్‌ని సిద్ధం చేశామని మరియు పైలట్ కూడా పూర్తి అయ్యిందని చెప్పారు. హార్ట్ ఫుల్ యోగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షలమంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. దీనిపై శ్రీనివాసరావు స్పందిస్తూ… దీనిపై ఇప్పటికే హైదరాబాద్‌లోని కన్హా శాంతివనం అనే సంస్థ ద్వారా 2 వేలమంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు. వీరిద్వారా ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఏడాదినుంచి పూర్తి ఫిజికల్‌గా యోగా శిక్షణాతరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కుప్పంలోని అగస్త్య సైన్స్ ఫౌండేషన్‌లో ఔత్సాహిక సైన్స్ ఉపాధ్యాయులకు జరగనున్న శిక్షణ గురించి తెలియజేశారు.
ఇప్పటివరకు పాటశాల విద్యలో సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక అధికారులంతా ఫలితాలపైనే పూర్తిగా దృష్టిసారించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. టెన్త్, ఇంటర్మీడియట్లలో 90శాతం ఫలితాల సాధన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం మెరుగుదలకు ఎఫఆరఎస్ను అమలు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న ఉపాధ్యాయులను, అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడిన సబ్జెక్టు టీచర్లకు మెంటార్ టీచర్లతో కెపాసిటీ బిల్డింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో వచ్చే ఏడాది చివరికి నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం, నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.
స్కిల్ డెవలప్మెంట్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పిఎం సేతు పథకం ద్వారా పారిశ్రామికవేత్తల సహకారంతో తొలివిడతగా 10పారిశ్రామిక అనుసంధానిత ఐటీఐ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం స్టీల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా సంస్థలతో సంప్రదించి, 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎండి గణేష్‌కుమార్ మాట్లాడుతూ… ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.43 లక్షలమందికి నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు. గత రెండేళ్లుగా జాబ్ మేళాల ద్వారా 1.72లక్షల మంది ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. జాబ్ మేళాల నిర్వహణలో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్చార్జి చైర్మన్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
















