- 68.57 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు
- విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్
- 12 కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
- ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవపై ప్రత్యేక తీర్మానం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో 12 కీలక ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినట్టు చెప్పారు.
అమరావతి (చైతన్యరథం): ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియాకు వివరించారు. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. రూ.20.62 కోట్లతో స×మీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 72 నెలల పాటు అమలు చేయనున్నట్టు తెలిపారు. సేవలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రతి ఏడాది సేవకు రూ.5వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరును 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్లోడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి తెలిపారు. రేపల్లె ఏరియా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌కు రూ.58.42 కోట్లు, అదనంగా 66 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. 2026-27 ‘తల్లికి వందనం’ మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు రాటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. అదనంగా 58,060 మందితో కలిపి ఆర్ధిక సాయం విడుదలకు ఆమోదం తెలిపిందని.. దీంతో 68,57,880 మందికి ఈ పథంకం వర్తిస్తుందని చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపుపై ఉత్తర్వులకు ఏపీ మంత్రివర్గం రాటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
విశాఖ జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఐఐటీ-జేఈఈ, నీట్లక ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారుల అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు ఆమోదం లభించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు జారీచేసిన ఉత్తర్వు లకు రాటిఫికేషన్ ఇచ్చిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవదాయశాఖకు బదలాయింపు నకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఏపీ విద్యా చట్టం-1982కు సవరణలు చేసే ప్రతిపాదనకు, విదేశీ ఉన్నత విద్యా సంస్థలు,ప్రైవేట్
యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు కొత్త పాలసీ-2026కు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడిందన్నారు. విదేశీ విద్యా సంస్థలు, ప్రైవేట్ యూని వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటు, ప్రోత్సాహకాలు, సదు పాయాలపై సమగ్ర విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
సిటీలు పెరుగుతున్న కొద్దీ గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతాయని మంత్రి అన్నారు. అలా వచ్చిన వారు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించి ఇళ్లు కట్టుకోవడం సహజమని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి వారిని కొందరు వాడుకోవడం చూస్తామని.. దీంతో ముఖ్యమంత్రి వీరికి న్యాయం చేయడానికి ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ ఆస్తిలో కొందరికి కోటి రూపాయలు కూడా ఉన్న దాఖలాలు ఉన్నాయన్నారు. ఏపీ విద్యా చట్టం-1982 సెక్షన్లలో సవరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని.. విద్యార్థులకు ఉన్న సిలబస్‌పై రెగ్యులర్ మానిటర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. నలుగురు మంత్రులు ముందస్తు అనుమతితోనే కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని తెలిపారు.
ముఖ్యాంశాలు
‘తల్లికి వందనం’ పథకం అమలు కోసం రూ. 10,208 కోట్లు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా 68.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ప్రతిపాదనకు ఆమోదం పలికారు.
వసతి గృహాలు, గురుకులాల విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
విదేశీ, ప్రైవేట్ వర్సిటీలను ఆకర్షిం చేందుకు ‘ఉన్నత విద్యా విధానం-2026’కు ఆమోదం తెలిపారు.
విశాఖపట్నం జిల్లా మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ‘ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.
రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరును 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు నిర్ణయించారు.
విధి నిర్వహణలో మృతి చెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందించేందుకు ఆమోద ముద్ర వేశారు.
హార్టికల్చర్ ఇన్స్పెక్షన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం రూ. 20.62 5 APHIMS ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
కొండపిలో గురుకులానికి 7 ఎకరాలు, ఆలయాభివృద్ధికి 7.66 ఎకరాల భూమి కేటాయించారు.
పేదల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.
సమావేశం అనంతరం రాజధాని భూముల అంశంపై మంత్రి నారాయణకు సీఎం పలు సూచనలు చేశారు. కేటగిరీ-4, ఎండోమెంట్ భూములకు సంబంధించి న్యాయ పరమైన అంశాలను పరిశీలించిన తర్వాత మరోసారి తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
















