- విధ్వంసం, అసత్య ప్రచారం వైసీపీ నైజం
- ఓటు వేయని జగన్కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు
- రాష్ట్రవ్యాప్తంగా పారదర్శకంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు
- ప్రభుత్వంపై బురదజల్లేందుకు నానా యాగీ చేస్తున్న గొడ్డలిపార్టీ
- ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్
జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కనిపిస్తున్నాయి. మాటలు మార్చడంలో జగన్ ను మించినవారు ఎవరూ లేరని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా ఈవీఎం వల్లే గెలిచారని ప్రచారం చేశారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే వైఖరి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అందరికీ ఒకటే. పేదవాడికైనా, ధనికుడికైనా, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా ఒకే ఓటు. కానీ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను అని చెప్పి, పోలింగ్ బూతు దగ్గరకు వెళ్లి ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల ఓటు పట్ల ఆయనకు ఉన్న నమ్మకం ఏమిటో స్పష్టం చేస్తోంది. ఓటు వేయని రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు.
కూటమి ప్రభుత్వాన్ని బదనామ్ చేయడానికి వైసీపీ నానా ఫీట్లు చేస్తోంది. 2024లో ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ను మరోసారి మున్సిపల్, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇచ్చారు. ఓటమిని జీర్ణించుకోలేక నిరాశతో ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అద్భుతం అన్నారు. ఇప్పుడు జరిగితే దౌర్జన్యం అంటున్నారు. తమ హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసి, ఎలక్షన్ కమిషనర్ ప్రాణహాని ఉందని కేంద్రానికి లేఖ రాసిన విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతుంటే విమర్శలు చేస్తున్నారు. పులివెందుల, పలమనేరు వంటి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ధనబలం, కండబలంతో గుత్తాధిపత్యం సాగించిన వారు, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి వస్తే దౌర్జన్యాలకు పాల్పడిన విషయం అందరూ చూశారు.
ఎంపీటీసీ స్థానాల్లో 17,726 చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీల్లో 1,445 స్థానాల్లో వేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 367 స్థానాల్లో వేశారు. గ్రామ పంచాయతీల్లో వేలాది స్థానాల్లో వేశారు. పోలీసు రక్షణతో, పోలీసు వాహనాల్లో అభ్యర్థులను తీసుకెళ్లి నామినేషన్లు వేయించారు. సమయం పెంచి అవకాశం ఇచ్చారు. అలా ఉండి కూడా ప్రభుత్వం, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై రిగ్గింగ్ చేశారు అంటున్నారు. అయితే మీ పార్టీకి సంబంధించిన నలుగురు అభ్యర్థులు (ఒకరు మేయర్ సహా) ఎలా గెలిచారు? మీరు చెప్పినట్టు రిగ్గింగ్ ఉంటే మీ అభ్యర్థులు కూడా గెలవకూడదు కదా?
ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి డీలిమిటేషన్, ఇతర అంశాలపై 61 కేసులు వేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు వేశారు. కానీ చట్టపరమైన అవకాశం లేకపోయినా సూత్రప్రాయంగా బీసీలకు సీట్లు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి అని చెప్పింది. ప్రజాక్షేత్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ప్రజలు మీ అసత్య ప్రచారాలను నమ్మలేదు. వైసీపీ నమ్ముకున్నది విధ్వంసాన్ని. మేము నమ్ముకున్నది ప్రజలను, ప్రజాతీర్పును, అభివృద్ధిని, సంక్షేమాన్ని. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన పనులు ప్రజలు చూశారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు.
ప్రజల్లోకి వచ్చి పోరాడండి. ప్రజాతీర్పును గౌరవించండి. అనవసరమైన, అర్థరహితమైన ఆరోపణలు మానుకోండి. అసెంబ్లీకి రాకుండా, అప్పుడప్పుడు వచ్చి బురద చల్లి వెళ్లిపోయే ధోరణి మానేయండి. గెలుపోటాలు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం తీవ్రంగా ఖండనీయం. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉంటుందన్నారు.




















