- ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
- రాష్ట్రవ్యాప్తంగా 67.24 శాతం పోలింగ్ నమోదు
- స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు
- రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించు కున్నారు. మొత్తంగా 67.24 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 659 జెడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 77 జెడ్పీటీసీ, 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శనివారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. పులివెందులలో పెట్రోల్ బాంబులతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. సంతనూతులపాడు, సత్తెనపల్లి, చీరాల, చంద్రగిరి, పులివెందుల నియోజకవర్గాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.




















