- పెట్టుబడుల ఆకర్షణ విషయంలో సీఎం చొరవ అది
- రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీకి బాటలేసింది చంద్రబాబే
- రిఫార్మర్‌కు సరైన నిర్వచనం సీbం చంద్రబాబే
- సింగపూర్‌లో సిన్సియర్‌గా క్లాసులకు వెళ్లాం..
- ఆత్మీయ విందులో మంత్రుల ప్రశంసలు, సరదా వ్యాఖ్యలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించడమే తప్ప, స్థిమితంగా నడవడానికి లేదని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. అయితే, పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతోపాటు… ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ చేసేంత వరకు విశ్రమించవద్దని సీఎం చంద్రబాబు పదేపదే గుర్తు చేయడంవల్లే పెట్టుబడుల రాక వరదలా వెల్లువెత్తుతోందని మంత్రి భరత్ వ్యాఖ్యానించారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చినందుకు మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు సీఎం సమర్థతను ప్రశంసిస్తూనే, చంద్రబాబు టీంలో పనిచేయడానికి తాము ఎంత ఉత్సాహంగా ఉన్నామో అనుభవాలను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంలో మంత్రి భరత్ మాట్లాడుతూ.. చంద్రబాబు సూచనలతో పరిశ్రమలు గ్రౌండింగ్ చేసేందుకు.. గ్యాప్‌రాకుండా ఉండేందుకు 90మంది వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని పని చేస్తున్నామని పరిశ్రమల మంత్రి భరత్ వివరించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. “ఇంజనీరింగ్ విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులున్న రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలతో రాష్ట్రాన్ని నింపి నాలెడ్జ్ ఎకానమీకి చంద్రబాబు బాటలు వేశారు. పట్టిసీమను ఒట్టిసీమ అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని గేలిచేస్తే.. అదే పట్టిసీమలో రూ.50 వేల కోట్ల సంపద సృష్టించి చూపించారని, దటీజ్ సీఎం చంద్రబాబు” అంటూ ప్రశంసించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రికార్డు స్థాయిలో హంద్రీ-నీవా జలాలను రాయలసీమకు తీసుకెళ్లామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.
వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. “సింగపూర్ దేశానికి అధ్యయనం చేసేందుకు వెళ్లినప్పుడు తిరిగి వెళ్లాక చంద్రబాబు ఏం అడుగుతారోననే భయంతో.. ఆ దేశంలో 7 రోజులపాటు క్లాసులకు అటెండ్ అయ్యామని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను చదువుకునే రోజుల్లో కూడా కాలేజీకి సరదాగా వెళ్లేవాడినని… సింగపూర్ పర్యటనలో మాత్రం భుజాన బ్యాగ్ వేసుకుని సీరియస్‌గా క్లాసులకు హాజరయ్యామంటూ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించి నవ్వులు కురిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని నిర్ణయించుకున్న కేంద్రాన్ని ఒప్పించి రూ.11 వేల కోట్లకుపైగా సీఎం నిధులు ఇప్పించారని, ఇది అసాధారణ పరిణామమని సత్యకుమార్ పేర్కొంటూ.. అంత పెద్ద నిర్ణయంలో ఏంచెప్పి ప్రధాని మనస్సు మార్చారో తెలియదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “రిఫార్మర్ అనే పదానికి రాజకీయాల్లో నిజమైన నిర్వచనం సీఎం చంద్రబాబు. ఏమాత్రం రిలాక్స్ కాకుండా నిరంతరం తాను పని చేయడంతోపాటు.. టీమ్ కూడా అలాగే పని చేయాలని… అప్పుడే అభివృద్ధి-సంక్షేమం అందించగలమని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.














