.దాడిచేసిన వారిని వదిలి మావాళ్లపై కేసులు బనాయిస్తారా?
.డీజీపీ సమాధానం చెప్పి తీరాల్సిందే!
.తప్పుచేసిన పోలీసులను వదిలేది లేదు
.నేతల అరెస్టులను ఖండిరచిన అధినేత చంద్రబాబునాయుడు
అమరావతి: కుప్పం నియోజకవర్గంలో పోలీసులు పదుల సంఖ్యలో టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చెయ్యడం ఉన్మాది పాలనకు, సైకో చేష్టలకు పరాకాష్ట అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కుప్పం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా 6గురిని అరెస్టు చెయ్యడాన్ని చంద్రబాబు ఖండిరచారు. తన పర్యటనలో పాల్గొన్న 60 మందిపై తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ వేధింపు చర్యలకు పరాకాష్ఠ అని చంద్రబాబు అన్నారు. అన్న క్యాంటీన్ పైన, టిడిపి నేతలపై దాడి చేసిన వైసిపి గూండాలను వదిలి.. టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టడం ఏం న్యాయమని పోలీసు శాఖను ప్రశ్నించారు. టిడిపి నేతలపై దాడి జరిగితే.. వారిపైనే హత్యాయత్నం కింద కేసులు పెట్టడంపై డిజిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల మద్దతుతోనే స్థానికంగా దాడులు జరిగాయని..తప్పు చేసిన పోలీసు అధికారులకు శిక్షలు పడేవరకు వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ కుట్ర రాజ కీయాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి టిడిపి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయాలను తెచ్చేం దుకు వైసిపి చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.