అమరావతి (చైతన్య రథం): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్‌కి విద్యా మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏఐ సహాయంతో ఎఫఎలఎన్ లక్ష్యాలను సాధించడంతోపాటు, వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా శిక్షణనిచ్చి వేలాది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలలో సీట్లు సాధించేలా ప్రణాళిక బద్ధంగా పనిచేసిన మాస్టారు పాఠ్యపుస్తక రచయితగా విద్యా ప్రయాణంలో భాగమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని, టీచరై.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం రాజేష్ అంకిత భావానికి నిదర్శనం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని, అండమాన్ నికోబార్ దీవుల నుంచి జెల్లి ప్రకాష్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.















