- సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ ఎగుమతులపై సదస్సుకు హాజరు
- విశాఖ ఎకనమిక్ రీజియన్ పై అధికారులతో సమీక్ష
- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్‌పై ప్రయాణించనున్న చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నిర్వహించే జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. శుక్రవారం ఆయన విశాఖ నగరంలో పర్యటించనున్నారు. సీఎం అమరావతిలోని క్యాంపు కార్యాల యం నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరి పది గంటలకు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద మొక్క నాటతారు. అనంతరం సైకిల్ పై బీచ్ రోడ్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగే నేషనల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ వర్క్‌షాప్ నకు హాజరవుతారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్, ఎస్పీ సింగ్ భగేల్ తదితరులు హాజరు కానున్నారు. ఆక్వాకల్చర్, మత్స్య రంగంలో స్టార్టప్‌లు, సీఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లు, మెరైన్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించిన వివిధ భాగస్వాములు పాల్గొంటారు.
సముద్ర ఆహార ఎగుమతుల ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషరీస్‌లో అవకాశాలు, మత్స్యరంగ అభివృద్ధి తదితర అంశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశాలపై చర్చిస్తారు. ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆక్వా కల్చర్ సర్టిఫికేషన్ లాంటి స్థిరమైన విధానాలకు ప్రోత్సాహం కల్పించడం లాంటి అంశాలపైనా చర్చ జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రాజెక్టు లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా విలువ జోడించిన ఉత్పత్తులు, ఎంఎస్ఎంఈలకు మద్దతు కల్పించే అంశాన్ని కూడా ఈ వర్క్‌షాప్ ద్వారా వివరించే అవకాశం ఉంది. డీవ్సీ సహా అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లాంటి ప్రాంతాల్లో అధిక విలువ కలిగిన మెరైన్ ఉత్పత్తుల వినియోగం, సీవీడ్, ఆర్నమెంటల్ ఫిష్, ముత్యాల పెంపకం లాంటి రంగాల అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పీఎంకేఎస్ఎస్వై (PMKSSY), కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాల లబ్ధిదారులకు ప్రోత్సాహకాలు అందిస్తారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై అధికారులతో సీఎం సమీక్షిస్తారు. సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.












