- జిల్లాకో ప్రత్యేక థీమ్… టూరిజం ప్రాంతాల్లోనూ వేదికలు
- యోగా నెలగా జూన్
- ఈ నెల 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
- 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
- పవన్ కళ్యాణ్ప తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికావు
- తమిళనాడులో నాతో సహా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయలేదా?
- ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు
- డీఎస్సీ నిర్వహణ టీడీపీ బ్రాండ్
- మంచి పనులపై బురదచల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర – 2026 నిర్వహణపై సీఎం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా, జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. యోగాను మన జీవన విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగాంధ్ర-2026’ నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ Yoga for Healthy Aging,వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు. ప్రతి
ఇంట్లో, ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలి. యోగాంధ్ర-2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతేడాది స్ఫూర్తిని కొనసాగించాలి. జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తాం. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్ నిర్ణయించాం. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో 2-3 వేల మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా – టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి చారిత్రక ప్రాంతాలు వేదికలుగా ఈ యోగా కార్యక్రమం చేపడుతున్నాం.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
విద్యాభ్యాసంతోపాటు యోగాభ్యాసానికి ప్రాధాన్యం
“యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. స్వర్ణాంధ్ర-2047 విజన్ లో భాగంగా యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 10లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేస్తాం. ప్రస్తుతం ఉన్న ట్రైనర్ల సంఖ్యను 2.50 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టాం. యోగాంధ్ర-2026 విజయవంతం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాం. జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, నిర్వహణ ఏర్పాట్లకు ఈ నిధులు వినియోగిస్తాం. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాం. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగిస్తాం. రాష్ట్రంలో ఒక కోటి మంది క్రమం తప్పకుండా యోగా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్. కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ చేపడుతున్నాం. జూన్ మొత్తాన్ని ‘యోగా నెల’గా ప్రకటించాం. దీనిని సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు సాయం తీసుకుంటున్నాం. ప్రతి ఇంటికీ యోగా చేరేలా ఆయన ప్రత్యేక వీడియోలు రూపొందించారు. సాధారణ యోగా ఆసనాలు, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగా సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కు పైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్స్ ఉచితంగా ప్రజలకు చేరువ చేయాలి.
వాట్సాప్ నెంబరు 8142404888కు Hi అని మెసేజ్ పంపిస్తే యోగా వీడియోలు వస్తాయి. స్కూళు , కాలేజీల్లో యోగాను చదువులో భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. చిన్న వయసు నుంచే యోగా అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దగలం. యోగాంధ్ర-2026 కోసం యోగాంధ్ర పోర్టల్‌ను ప్రారంభించాం.
yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుంది. మహిళలు, విద్యార్థుల్లో యోగాపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సంజీవని ప్రాజెక్టుకు కూడా లింక్ చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్, బ్రహ్మకుమారీస్, దాజీ, బాబా రామ్ దేవ్ లాంటి విశిష్ట వ్యక్తుల భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ప్రకృతి ఆశ్రమం నిర్వహిస్తున్న మంతెన సత్యనారాయణరాజు సేవలను కూడా వినియోగించుకుని యోగాను ఇంటిగ్రేట్ చేస్తాం. మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యోగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ చేపడుతున్నాం. గత ఏడాది కార్యక్రమంతో దేశం, ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేశాం. విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన యోగాంధ్రతో రికార్డులు సృష్టించాం.
గతేడాది 2.44 కోట్ల మంది యోగాంధ్రలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1.91 కోట్ల మందికి సర్టిఫికెట్లు అందించాం. 1.33లక్షల వేదికలపై 1.53 లక్షల మంది ట్రైనర్లతో నిర్వహించాం. 2.18 కోట్ల మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు ఉపయోగించుకునేలా యోగాంధ్ర పోర్టల్ ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద… దానిని అంతా అందిపుచ్చుకోవాలి. ఏపీలో చేస్తున్న ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఈ విజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందించేలా చర్యలు చేపడుతున్నాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంతో దేశం, ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేశాం.
విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించిన యోగాంధ్రతో రికార్డులు సృష్టించాం. గతేడాది 2.44 కోట్ల మంది యోగాంధ్రలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1.91 కోట్ల మందికి సర్టిఫికెట్లు అందించాం. 1.33లక్షల వేదికలపై 1.53 లక్షల మంది ట్రైనర్లతో నిర్వహించాం. 2.18 కోట్ల మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు ఉపయోగించుకునేలా యోగాంధ్ర పోర్టల్ ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద… దానిని అంతా అందిపుచ్చుకోవాలి. ఏపీలో చేస్తున్న ప్రకృతి సేద్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఈ విజ్ఞానాన్ని మనం ప్రపంచానికి అందించేలా చర్యలు చేపడుతున్నాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఇప్పుడు సాధ్యం కాదు
“తెలంగాణలో పవన్ కళ్యాణ్్ప చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశాను. అక్కడకి కర్నాటక సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారు, జాతీయ స్థాయి నేతలు వచ్చారు. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్
ఉంది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పార్టీ శాఖను పెట్టారు. విస్తరిస్తాం అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల్లో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారు. అక్కడి రాజ్యాంగాల ప్రకారం పని చేస్తున్నారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో… వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారు. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి తప్ప… ప్రజల మధ్య విబేధాలు తేవడం సరికాదు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనసవరంగా వివాదాలు సృష్టించం ఎవరికీ మంచిది కాదు.”అని చంద్రబాబు చెప్పారు.
బాగు చేస్తుంటే బురద చల్లుతారు… ఇదీ గొడ్డలి పార్టీ నైజం
“గొడ్డలి పార్టీకి విమర్శలు, విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు బహిష్కరించాలి. అసత్యాన్ని పదేపదే చెబితే ప్రజలు విశ్వసిస్తారని కొందరు అనుకుంటున్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకానికి టీడీపీ ఓ బ్రాండ్. ఎన్నికల్లో ప్రకటించి అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి అత్యంత కట్టుదిట్టంగా నియామకాలు చేపట్టాం. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అంటున్నారు. కానీ వారికి క్రీడల్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయి. వాళ్ల పేటీఎం బ్యాచ్‌ల ద్వారా లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. కొందరు చేస్తున్న దద్దమ్మ పనులకు ప్రజలు ఇబ్బందిపడాలా…? పారదర్శకంగా చేసిన నియామకాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి ఆ తర్వాతే మాట్లాడాలి.సాక్ష్యాలు, నిజాలతో అసెంబ్లీలో గట్టిగా పోరాడిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఏదేదో మాట్లాడేసి బురద చల్లుతామంటే ఎవరు విశ్వసిస్తారు..? యోగాంధ్ర నిర్వహణకు రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించాం. దానిపైనా విమర్శలా… ప్రభుత్వం చేస్తున్న ప్రతీ మంచి పనినీ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. దీనికి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం తప్ప మరోమార్గం లేదు.” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.













