- తిరుపతి, అమరావతి, విశాఖల్లో బహిరంగ సభలు
అమరావతి(చైతన్యరథం): నాలుగు రాజ్యసభ స్థానాల పంపకంపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ 3 సీట్లు, జనసేన 1 సీటు తీసుకోవాలని ఎన్డీఏ నేతల సమావేశంలో తేల్చారు. జనసేన రాజ్య సభ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత ప్రకటిస్తారని మంత్రి నాదెండ్ల మనో హర్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని ఎన్డీఏ సమావేశం లో నిర్ణయించారు. ఈనెల 9న తిరుపతి (సంక్షేమం), 12న అమరావతి (సుపరిపాలన), 15న విశాఖపట్నంలో (అభివృద్ధి) బహిరంగ సభలు నిర్వ హించనున్నారు. ఈనెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతారు. మొత్తం కార్యాచరణ షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ -24 నెలల పాలనలో అమలుచేసిన 24 ప్రధాన కార్యక్రమాలు, పథకాలపై విస్తృత ప్రచారం చేపడతామని చెప్పారు. ‘సర్’ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగిందని వెల్లడించారు.
పౌరసరఫరాల మంత్రి, జనసేన ప్రతినిధి నాదెండ్ల మనోహర్ మాట్లాడు తూ… కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసిన అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారన్నారు. 24నెలల పాలన లో చేపట్టిన 24ప్రధాన కార్యక్రమాలు.. పథకాలపై ప్రచారం చేపడతామని, ఈ కార్యాచరణ ద్వారా ప్రజల ఆశీస్సులను మరోసారి కోరతామని వెల్లడించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ -ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9నుంచి కార్యాచరణ మొదలుపెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. పరిశ్రమలు, పోలవరం, అమరావతి నిర్మా ణం, విశాఖ రైల్వే జోన్వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తా మన్నారు. టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టేనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే తీరులో వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పక్షాలు కలిసే ఉంటాయని, ఒక్కటిగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.













