- అభివృద్ధి చరిత్రలో సువర్ణాధ్యాయం
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
భోగాపురం (చైతన్యరథం) ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతూ ‘అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం’ శనివారం ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సుమారు 2,703 ఎకరాల విస్తీర్ణంలో, రూ.4,727 కోట్ల వ్యయంతో, 3,800 మీటర్ల రన్వేతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త ఊపునివ్వడంతోపాటు, ప్రాంత అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవసుందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో కేంద్ర అనుమతులు సాధించి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రాజెక్టుకు బలమైన పునాది వేసింది. 2019 ఫిబ్రవరిలో ఈ విమానాశ్రయ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శుంకుస్థాపన చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం భూసేకరణ కొనసాగించినప్పటికీ, 2023 మే 3న రెండోసారి శంకుస్థాపన చేసినా నిర్మాణ పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. ప్రాజెక్టు స్థలాన్ని తగ్గించే ప్రయత్నాలు, పసులపై తగిన శ్రద్ధ లేకపోవడంతో విమానాశ్రయ నిర్మాణం జాప్యానికి గురైంది.
అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతర పర్యవేక్షణ, అనుసంధాన రహదారుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలతో అన్ని అడ్డంకులు తొలగి, సుమారు రెండేళ్లలోనే ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది..భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ఆగస్టు 17న నుంచి సింగపూర్కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభం కానుండగా, త్వరలోనే మరిన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి తమ సర్వీసులను ప్రారంభించనున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో విమానాల రవాణాకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ విమానాశ్రయం ద్వారా శ్రీకాకుళం, ఉద్దానం, విజయనగరం ప్రాంతాల వ్యవసాయ, ఉద్యాన, మత్స్య ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడనుంది. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు, సేవారంగ సంస్థలు ఏర్పడే అవకాశాలతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశ, విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే కాకుండా, ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించే చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.














