అమరావతి (చైతన్యరథం): జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గొడవలు సృష్టించి గెలవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. దీనికి నిదర్శనంగా పులివెందులలోని ఎర్రిపల్లిలో బాంబు దాడుల ద్వారా ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఓటింగ్ సుమారు 22 శాతం ఉండగా, రాయలసీమ ప్రాంతాల్లో చిత్తూరు 33 శాతం, అనంతపురం 30 శాతం, కర్నూలు 30 శాతం నమోదైంది. కానీ కడపలో తక్కువ నమోదు కావడానికి వెనుక వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కుట్రలే కారణమని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా బయటకు వచ్చి ఓటు వేస్తుంటే వారిని బాంబుల ద్వారా భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కడపలో పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా బూతుల్లోకి ప్రవేశించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. అర్బన్ లోకల్ బాడీస్‌లో కూటమికి వచ్చిన భారీ ఫలితాలు (సుమారు 95 శాతం స్ట్రైక్ రేట్) జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయనే భయంతో వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కుప్పంలో బయట ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి ఓట్లు వేయించే ప్రయత్నాలు, తిరుపతిలో గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లాగే ఆధార్ కార్డులు ఇచ్చి సామాన్య ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నాలు, రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బులు పంచి బలవంతం చేసిన సంఘటనలు, పొంగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి, జమ్మలమడుగులో రామ సుబ్బారెడ్డి కుమారుని దౌర్జన్యం, రైల్వే కోడూరులో పెట్రోల్ బాంబు, అనంతపురం స్కూల్ వద్ద పెట్రోల్ బాంబు వంటి సంఘటనలు వైసీపీ విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వస్తుంటే పెట్రోల్ బాంబులు వేయడం, బూత్ క్యాప్చరింగ్, బయటి ప్రాంతాల నుంచి జనాన్ని మొబిలైజ్ చేయడం వంటి దుర్మార్గపు ఆలోచనలతో వైసీపీ ముందుకు వెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతుంటే పులివెందుల, పొంగనూరు వంటి ప్రాంతాల్లోనే గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలి. ఇది రాజకీయమా? రౌడీజమా? కూటమి ప్రభుత్వం నిబద్ధతతో, ప్రజలకు అనుకూలంగా పాలన సాగిస్తోంది. అర్బన్ లోకల్ బాడీస్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పే జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికల్లో కూడా వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే వైసీపీ అరాచకాలు, అబద్ధాలు, భయభ్రాంతుల ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు అరాచకాన్ని సహించరు. రాయలసీమ ప్రజలు సహించరు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు మానుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించాలి. విద్వేషం, హింస ద్వారా ఓట్లు గెలవాలనుకుంటే ప్రజలు సహించరు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తున్నారు. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు.




















