న్యూఢిల్లీ: ఒకరోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు, పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు గురువారం ప్రధాని మోదీతో పాటు మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్, నితిన్ గడ్కరీలతో భేటీ అవుతారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుతోపాటు బీచ్ కారిడార్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. ప్రత్యేకించి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన అధ్యయనం చేయించాలని కూడా కోరనున్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక నిధులు మంజూరుపై కూడా ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరనున్నారు.
వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర సహకారం అందించాలని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చించనున్నారు. గోదావరి నది నుంచి పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళ్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే అంశంతోపాటు నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీలో చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్జెన్ రైజర్ సదస్సులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కలిసి సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు.















