- పారదర్శక మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు
- పేటీఎం బ్యాచ్‌తో సొంత మీడియాలో ఫేక్ వీడియోలు
- అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- రాబోయే డీఎస్సీని అడ్డుకునే కుట్ర
- గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అడ్డుకోవడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా జగన్ రెడ్డి, గొడ్డలి పార్టీలు పెట్టుకున్నాయని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై కూడా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎక్కడా లొసుగులు లేకుండా డీఎస్సిని 148 రోజుల్లో నిర్వహించాం. దాదాపు 16 వేల ఉద్యోగాలను రికార్డ్ టైంలో భర్తీ చేస్తే… ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని, ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేని జగన్ రెడ్డి నేడు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీని అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. జాబ్ క్యాలెండర్, ఇళ్ల పట్టాలు, పేదలకు ఇళ్లు వంటి అనేక హామీలు ఇచ్చి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే… మేం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం.
సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఏటా డీఎస్సీ నిర్వహించేలా ప్రణాళికలు రచించాం. యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే మెగా డీఎస్సీ నిర్వహించాం. 2026 మే నుంచి గొడ్డలి పార్టీ ఒక తమాషా ప్రారంభించింది. హై కోర్టుకు పోవడం పిల్ వేయడం, కోర్టు కొట్టేయడం, వైసీపీ నాయకులకు చివాట్లు పెట్టడం షరా మాములగా మారింది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంపై డిక్టేటర్ షిప్ అంటూ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు చెప్పింది కూడా అర్థం చేసుకోలేని అజ్ఞానులు వైసీపీలో కొనసాగుతున్నారు. రాజకీయం చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్‌పై జగన్ రెడ్డి దాడి చేస్తున్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎలాంటి తప్పు జరగలేదని చెబుతున్నా కూడా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. సీబీఐ విచారణ దేనికి వేస్తారో కూడా తెలియని అసమర్థుడు జగన్ అని ఎమ్మెల్యే మాధవి దుయ్యబట్టారు.
జగన్ రాజకీయమే ఫేక్
జగన్ రెడ్డి రాజకీయ జీవితమే ఒక ఫేక్. అందుకే ఆయనకు ప్రతిదీ ఫేక్ లా కనిపిస్తుంది. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? కర్నూలు జిల్లాకు చెందిన భార్య, భర్తలు కరిష్మా, షేక్ ఇమామ్‌లపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండానే డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చదువుతున్నప్పుడు మాత్రమే స్పోర్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఏ రూల్ ప్రకారం ఉందో గొడ్డలి పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. భార్య ఒక కేటగిరి, భర్త మరో కేటగిరిలో ప్రతిభ చాటారు. ఉద్యోగాలు తెచ్చుకున్నారు. భార్యాభర్తలు ఉద్యోగాలు పొందకూడదనే రూల్ ఎక్కడైనా ఉందా. పారదర్శకంగా ఉద్యోగాలు సాధించిన యువత జీవితాలతో గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. దేశంలో 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు కూడా అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటుతున్నారు. గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. 41 ఏళ్ల కొరడా పద్మజా స్పోర్ట్స్ లో ప్రతిభ చాటిన మహిళ. అథ్లెటిక్ లో మెడల్ సాధించి ఉద్యోగం సాధిస్తే 41 ఏళ్లకి స్పోర్ట్స్ కోటా ఏమిటని మాట్లాడే గొడ్డలి పార్టీ నాయకులకు సిగ్గుండాలి.
నిజాయితీగా ఉద్యోగాలు సాధించిన వారి పట్ల వైసీపీ ఎందుకు ఇంత విషపూరిత రాజకీయాలు చేస్తోంది.
రేపు భవిష్యత్‌లో జరగబోయే మరో డీఎస్సీని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. రాబోయే డీఎస్సీ నియామకాలను తప్పుబట్టి యువతకు ఉద్యోగాలు సాధించకుండా అడ్డుకునే కుట్రకు జగన్ తెర తీశాడు. యువత అంతా మరో డీఎస్సీ కోసం సిద్ధమవుతుంటే… దానిని అడ్డుకునేందుకు జగన్ రెడ్డి, గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీ హయాంలో ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పత్రాలు దిద్దించారు. గ్రూప్ 1 తప్పిదాలపై జగన్ రెడ్డి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తాడా అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. సొంత పార్టీ నాయకులతో డీఎస్సీ పరిక్షలు రాయించి, వారిచేతనే నేడు తప్పుడు ఆరోపణలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో సానుభూతి రాకపోగా… ఇంకా కిందికి పడిపోతారు. యువత జీవితాలతో ఆడుకోవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నాం. ప్రతి ఏటా నిర్వహించే డీఎస్సీలో యువత ఉద్యోగాలు సాధిస్తారు. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు, లోకేష్‌ల విధానాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. ప్రజలు జగన్ రెడ్డిని అన్ని విధాలుగా ఛీ కొడుతున్నారని ఎమ్మెలే మాధవి ధ్వజమెత్తారు.













