నూజివీడు (చైతన్య రథం): వాతావరణ మార్పులు, కరవు పరిస్థితులను తట్టుకుని భవిష్యత్‌లోనూ ఆహార భద్రతను కాపాడేలా శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాల అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. వ్యవసాయం బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని, రైతులే భారతదేశానికి వెన్నెముక అని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం కాట్రేనిపాడులోని గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీలో సోమవారం నిర్వహించిన భారతదేశపు తొలి నాన్-జీఎంఓ, హై-ఎక్స్‌పాన్షన్ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాల ఆవిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విత్తనాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇతరరంగాల్లో సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పటికీ వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని అందించిందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులు దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు 17 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. అందువల్ల రైతుల సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
కరవును తట్టుకునే విత్తనాలపై దృష్టి
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు వ్యవసాయానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరవు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధించే పంట రకాలను అభివృద్ధి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉండేలా కరవును తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేసి, వాటిని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
దిగుమతుల నుంచి స్వయం సమృద్ధి వైపు
ఒకప్పుడు దేశంలో అవసరమైన మొక్కజొన్నలో సుమారు 70 శాతం వరకు అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని అబ్దుల్ నజీర్ గుర్తుచేశారు. దిగుమతుల కోసం చెల్లించే భారీ మొత్తాలు విదేశాలకు వెళ్లేవని, ఇప్పుడు అదే విలువ భారత రైతులకు చేరుతోందని అన్నారు. దేశీయంగా నాణ్యమైన విత్తనాలను అభివృద్ధి చేసి, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం మరింత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ముసునూరులో ఆవిష్కరించిన నాన్-జీఎంఓ హైబ్రిడ్ విత్తనాలు దేశీయ విత్తనాభివృద్ధి, విలువ ఆధారిత వ్యవసాయానికి ఒక ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
స్వదేశీ విత్తనాలే భవిష్యత్ బాట
ముసునూరులో ఆవిష్కరించిన నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాల ద్వారా దేశీయ విత్తన సాంకేతికతకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. స్వదేశీ పరిశోధన, రైతుల భాగస్వామ్యం, పరిశ్రమల పెట్టుబడులు కలిస్తే వ్యవసాయ రంగంలో దిగుమతుల స్థానాన్ని దేశీయ ఉత్పత్తులు భర్తీ చేయగలవని పేర్కొన్నారు.
















