- దేశంలో అత్యుత్తమ విద్యావిధానం సాధించడమే మన లక్ష్యం
- ఇకపై ప్రతినెలా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతా
- సంస్కరణలు పూర్తయ్యాయి… ఇక నూరుశాతం ఫలితాపై దృష్టి పెట్టాలి
- మారుతున్న చిన్నారుల ఆలోచనలకు అనుగుణంగా బోధనా పద్ధతులు
- క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
విజయనగరం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలో నెం.1గా తీర్చిదిద్దడమే నా లక్యం. ఇందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలసికట్టుగా పనిచేయాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ… విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టిసారించాలి. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలసుకుంటా. సంస్కరణల కారణంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇది తొలిమెట్టు మాత్రమే. నూరుశాతం ఫలితాల సాధనపై దృష్టిసారించాలి. ఇన్నొవేటివ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా మెళకువలు నేర్పాలి అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
యువగళం పాదయాత్ర సమయంలో సంస్కరణల ఆలోచన
యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలను చూశాను. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గమనించాను. విద్యారంగంలో సంస్కరణలు తేవాలని ఆనాడే నిర్ణయించుకున్నా. అత్యంత సవాళ్లతో కూడిన విద్యాశాఖ ఎందుకని చాలామంది సన్నిహితులు నన్ను అడిగారు. సమాజంలో మార్పు తీసుకురావడం విద్య ద్వారానే సాధ్యమని నమ్మే వ్యక్తిని నేను. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు గ్రామీణ పాంతాల్లో విభిన్న నేపథ్యం కలిగిన వారు అధికంగా ఉంటారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. విశాఖలో ఓ ప్రైవేటు స్కూలు టీచర్ చిన్నారిపై చేయి చేసుకోవడంతో చిన్నారి చనిపోయిన బాధాకరమైన ఘటన నన్ను కలచివేసింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కాలం మారింది, విద్యార్థులు ప్రశ్నించే రోజులు వచ్చాయి. క్రిటికల్, ఎనలిటిక్ థింకింగ్, అసెస్‌మెంట్, కరిక్యులమ్ మార్పులు, బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం క్లస్టర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. చిన్నారులకు గ్యారంటీడ్ ఎఫఎలఎన్ అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉపాధ్యాయులు సమ్మేటివ్, ఫార్మేటివ్ టెస్ట్, ఫలితాలపై శ్రద్ధ వహించాలి అని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ
విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చా. డిఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశా. మరో 3వేల పోస్టులు ఈ ఏడాది మరో డిఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నాం. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్లాండ్ పంపాం. అక్కడ టీచర్ల నేర్చుకున్న ఉత్తమ బోధనా పద్ధతులను రాష్ట్రంలో అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిశనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. సంస్కరణల ఫలితంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు సాధించాం, ఇది తొలిమెట్టు మాత్రమే. నూరుశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలి. పిల్లలు ఆనందకరమైన, ఆటపాటల వాతావరణంలో చదువుకోవాలన్నదే నా ఆలోచన. మన ఆలోచనలు, విధానాలు విద్యార్థి కేంద్రంగా మాత్రమే ఉండాలి. లీప్ యాప్‌లో ప్రతి టీచర్ తమ సలహాలను నమోదు చేయాలని కోరుతున్నా. క్రియేటివ్ క్లబ్, లీడర్‌షిప్ క్లబ్, లాంగ్వేజ్ క్లబ్, మ్యాథ్ అండ్ సైన్స్ క్లబ్, గ్రీన్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, యాంటీ డ్రగ్స్ క్లబ్ (ఈగల్ క్లబ్)లపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వృత్తిపరమైన అభివృద్ధి సెషన్ల ద్వారా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించు కోవాలి అని మంత్రి సూచించారు.
మారుతున్న చిన్నారుల ఆలోచనను పసిగట్టాలి
ఇటీవల ఒక కొడుకు సొంత తల్లిని చంపేశాడు. మరోచోట పిల్లలు టీచర్‌పై దాడిచేసిన ఘటన కూడా చోటుచేసుకుంది. జనరేషన్ల మధ్య సెన్సిటివిటీ పెరిగింది. మూడుతరాలు మారాయి. పిల్లలు మారుతున్నారు. వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో నైతిక విలువల ఆవశ్యకతను గుర్తించి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా విలువలతో కూడిన విద్యపై ప్రత్యేక పాఠ్యాంశాలు తయారు చేయించాం. ఇదే సమయంలో తల్లిదండ్రులు, మహిళలను గౌరవించడంపై విద్యార్థులకు చిన్నతనం నుంచే శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే టెక్నిక్స్‌పై టీచర్లు శ్రద్ధ వహించాలి. చేపట్టిన సంస్కరణల్లో కొన్నింటిలో లోపాలు ఉండొచ్చు. ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా తెలియజేస్తే సరిదిద్దుకుంటాం. ఇప్పటివరకు పకడ్బందీ సంస్కరణలు తెచ్చాం. ఇక సంస్కరణలు ఉండవు, పూర్తిగా ఫలితాలపై మాత్రమే అందరూ దృష్టి పెట్టాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేవాళ్లంతా క్వాలిఫైడ్ టీచర్లు. అనేక కారణాలవల్ల గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డారు. గత రెండేళ్లుగా ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని పూర్తిగా తగ్గించాం. ప్రతి శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలు వింటున్నాం. ఇప్పుడు ఇక లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనే శ్రద్ధ వహించాలి. కొంతమేర ఫలితాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి ఆ ఫలితాలపై సంతృప్తి చెందడం లేదు. నూరుశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి. మీకు అండగా నేనుంటా. రాబోయే ఐదేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌వైపు చూసేలా అత్యుత్తమ విద్యావిధానానికి అందరూ కలసికట్టుగా పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.















