- కాలుష్య వ్యర్థాల శుద్ధిప్లాంట్లను పక్కాగా నిర్వహించాలి
- పుష్కరాల నిర్వహణలో సామాజిక బాధ్యత చూపండి
- పరిశ్రమల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భేటీ
రాజమహేంద్రవరం (చైతన్య రథం): గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అడ్డుపడబోదన్నారు. అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలూ కాలుష్య కారకాలను నివారించి, శుద్ధిచేసే ప్లాంట్లను పద్ధతులను పకడ్బందీగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరాల ప్రత్యేక సమీక్ష అనంతరం పారిశ్రామికవేత్తలతో ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “పరిశ్రమలనుంచే వ్యర్ధాలు నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉంది. ప్రతి పరిశ్రమ శుద్ధి ప్లాంటు నిర్వహణ తప్పనిసరి చేసుకోవాలి.
వ్యర్ధాలను ఆధునిక పద్ధతులను ఉపయోగించి పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలి. ప్రజలకు తాగు, సాగునీటికి వినియోగించే నీటిలో కాలుష్యకారక వ్యర్ధాలు కలపడంవల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. భవిష్యత్తు తరాలకు కొత్త ఆరోగ్య సమస్యలు పుడతాయి. వీటిని పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టుకొని కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి. పరిశ్రమల్లో శుద్ధిప్లాంట్ల నిర్వహణ వ్యయాన్ని ఏమాత్రం భారం అనుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించండి. ఇకనుంచి తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలుష్యంత్రణ మండలి ప్రతి పరిశ్రమను ఆడిట్ చేసి, ఆ పరిశ్రమ పరిస్థితిని రెడ్, ఎల్లో, గ్రీన్ విభాగాలుగా గుర్తిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయం, నదుల్లో ఇమిడి ఉంటుంది. వాటిని రక్షించుకోవడం మన బాధ్యతగా భావిద్దాం” అని పిలుపునిచ్చారు.
పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి
“వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అవసరం. తగిన చొరవ తీసుకొని పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలి. పుష్కరాల విజయవంతానికి పరిశ్రమల నిర్వాహకుల చొరవ చాలా అవసరం. ప్రభుత్వానికి తగిన విధంగా సహకరించాలి” అని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.















