- గత వైకాపా పాలనలో కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తల వేధింపు
- రాష్ట్రంలో 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
- యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం
- చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు
- చీపుర్లపాడులో రూ.10.51 కోట్లతో ఎంఎసఎంఈ పార్కుకు శంకుస్థాపన
కోటబొమ్మాళి (చైతన్య రథం): గత వైకాపా పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని కమీషన్ల పేరుతో వేధించి భయభ్రాంతులకు గురిచేశారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నాకెంత.. నీకెంత” అంటూ పారిశ్రామికవేత్తలను భయపెట్టడంవల్లే వారు ఈ రాష్ట్రానికి దండం పెట్టి వెనుదిరిగారని మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు గ్రామ పరిధిలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10.51 కోట్ల వ్యయంతో 12.22 ఎకరాల విస్తీర్ణంలో 74 ప్లాట్లతో నూతనంగా అభివృద్ధి చేయనున్న ఎంఎసఎంఈ (ఎంఎసఎంఈ) పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఎంఎసఎంఈ పార్కులు విప్లవాత్మక సోపానాలుగా నిలుస్తాయని మంత్రి కింజరాపు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 38 పార్కులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యంలో ‘గొడ్డలి పార్టీ’కి స్థానం లేదు
ప్రజాస్వామ్యంలో ‘గొడ్డలి పార్టీ’కి ఎలాంటి స్థానం లేదని, అధికారం కోసం సొంత బాబాయినే అడ్డంగా నరికేసే వారిని ప్రజలు పాతాళానికి పంపారని అన్నారు. 2019-2024 మధ్య కాలంలో గ్రామాల్లో కనీసం గుప్పెడు మట్టి కూడా పోయకుండా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ‘సీబీఎన’ అంటేనే ఒక బ్రాండ్ అని, ఆయన నాయకత్వంపట్ల పెట్టుబడిదారుల్లో అపారమైన నమ్మకం ఉందన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ విధానంతో పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకర్షిస్తున్నామని, గూగుల్, రిలయన్స్, మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని వివరించారు. ఎన్నికల హామీ మేరకు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం
శ్రీకాకుళం జిల్లాలో వలసలను అరికట్టి, యువతకు, మహిళా సంఘాలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ఈ ఎంఎసఎంఈ పార్కుల ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ఇవి అద్భుత వేదికలుగా మారనున్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు, యువత పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం రూ. 620 కోట్లు మంజూరు చేసిందని, 2029 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
జిల్లా ప్రగతికి పరిశ్రమలే ప్రాణం.. అడ్డుకునే వారిని సహించం
“మన జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే పారిశ్రామికీకరణే మన ముందున్న ఏకైక మార్గం. పరిశ్రమలు వస్తేనే మన జిల్లా రూపురేఖలు మారతాయి. రైతన్నలు పెద్ద మనసు చేసుకుని పరిశ్రమల స్థాపనకు తమ భూములను అందిస్తే.. మన జిల్లాలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. తద్వారా మన యువతకు, మన బిడ్డలకు ఇక్కడే లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి కోసం మన యువత పొట్టచేతపట్టుకుని వేరే ప్రాంతాలకు వలసపోయే దుస్థితి తప్పుతుంది. కానీ… నేడు మన జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఒక పక్క జిల్లాను అభివృద్ధి చేయాలని మనం అహర్నిశలు శ్రమిస్తుంటే.. అభివృద్ధిని ఓర్వలేని కొందరు స్వార్థపరులు, పరిశ్రమలు వస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సహకరించాలి” అని అచ్చెన్నాయుడు మనస్ఫూర్తిగా కోరారు.
60 ఏళ్ల నిరీక్షణకు తెర… 2029నాటికి నేరడి బ్యారేజీ పూర్తి
జిల్లా ప్రజల 60 ఏళ్ల సుదీర్ఘ కలకు త్వరలోనే మోక్షం కలగనుందని, నేరడి బ్యారేజీ నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం కాబోతోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదల, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేసే సువర్ణ అవకాశం… రాష్ట్ర మంత్రిగా తనకు, జిల్లా ఎమ్మెల్యేలకు, అధికారులకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2029నాటికి నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని వందశాతం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని ప్రతి బీడు భూమికీ సాగునీరు అందుతుందని, రైతన్నలు ఏడాదికి మూడు పంటలు పండించుకుంటూ సిరులు పండించే సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి ఉద్ఘాటించారు.
ఉక్కు భూములను ఆక్రమించాలని చూసిన జగన్
అధికారం కోసం జగన్‌రెడ్డి ఎవరినీ వదలరని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “స్వార్థం కోసం ఎవరినైనా సరే బలిచేసే నైజం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది. ఇలాంటి విచ్ఛిన్నకర పార్టీకి మన రాష్ట్రంలో మనుగడ సాగించే అర్హత లేదు. రాబోయే రోజుల్లో ఆ పార్టీని శాశ్వతంగా పాతాళానికి తొక్కేయడం ఖాయం” అన్నారు. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో, ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల పునాదులమీద వెలసిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూసింది. ఉక్కు పరిశ్రమను కాపాడటం చేతకాకపోగా, దాన్ని ప్రైవేటీకరించి ఆ విలువైన భూములను సైతం ఆక్రమించుకోవాలని జగన్ అండ్ కో కుట్రలు పన్నారు. కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిరక్షణకు నడుంబిగించారు. కేంద్రంతో అలుపెరగని కృషి చేసి, ఉక్కు పరిశ్రమకు ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేయించారు. అంతేకాకుండా, ఆ పరిశ్రమపై పడే విద్యుత్ భారాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, అధికారులు, తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.















