- గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల టాస్క్ ఫోర్స్
- రూ.100 కోట్ల బడ్జెట్
- ఆరు నెలల్లో మార్పు కనిపించాలని ఆదేశం
రాజమహేంద్రవరం (చైతన్య రథం): “మన దాహం తీర్చి, మనకు జీవితాన్ని ఇచ్చే పవిత్రమైన జీవ నదులను మనమే చేతులారా చంపేస్తూ, వాటిని మృత నదులుగా మారుస్తున్నాం” అని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ-అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నదులపట్ల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగునీరు దొరకడమే కష్టమవుతుందని హెచ్చరించారు. భగవంతుడు ప్రసాదించిన నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ, మళ్లీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విచిత్ర పరిస్థితికి స్వస్తి చెప్పాలని పిలుపిచ్చారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ-పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణకు అంతర్ శాఖల టాస్క్ ఫోర్స్
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారాలను సూచించే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయాలని, దాని సూచనలు వేగంగా అమలు జరిగేలా పర్యవేక్షణ కమిటీ కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, వచ్చే ఆరు నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. నది ఎక్కడెక్కడ కలుషితమవుతోంది, ఏయే కాలువలు, ఉపనదులు వ్యర్థాలను మోసుకొచ్చి నదిలో కలుస్తున్నాయి అనే విషయాలపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించారు. నది తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి ‘పొల్యూషన్ ఆడిట’ నిర్వహించాలని, నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపాలని సూచించారు.
రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్
గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో కాలుష్య నియంత్రణ చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పటిష్ట అంతర్ శాఖల టాస్క్ ఫోర్స్‌లో ఆరు జిల్లాలకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వాములుగా కలిసి పని చేస్తారు. కొన్ని పరిశ్రమల రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదీపాయల్లో కలుస్తున్న నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతుందని తెలిపారు.
హడావుడి పనులతో భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దు
పుష్కరాలు సమీపిస్తే హడావుడిగా టెండర్లు పిలిచి నాణ్యత లేకుండా తాత్కాలిక ఘాట్లు, కట్టడాలు నిర్మిస్తే అవి కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గతంలో అలాంటి దుర్ఘటనలు చూశామని, ఆ తరహా నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో పనులు చేయాలని అధికారులను కోరారు. “మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు. గోదావరిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి” అని ఆదేశించారు.
285 గ్రామ పంచాయతీలు భాగస్వాములు
గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి దాదాపు 10 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ భారీ రద్దీని తట్టుకోవడానికి పుష్కరాలు కేవలం రాజమహేంద్రవరానికే పరిమితం కాకుండా గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల్లోని 285 గ్రామ పంచాయతీలను అధికారులు గుర్తించారు. ఆయా పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఘాట్లను అభివృద్ధి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం గ్రామాల్లో ‘హోం స్టే’ సౌకర్యాలు కల్పించడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు
గోదావరి పుష్కరాలను దేశమంతటా ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల్లో ఏడాదిపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, పుష్కరాల నాటికి నదీ తీరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనిపించకూడదని ఆదేశించారు. ఇందుకోసం ఎన్విరాన్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్ కఠినమైన చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. “జీవ నది మన తల్లి లాంటిది. దాన్ని కలుషితం చేస్తే మన భవిష్యత్తుని మనమే పాడుచేసుకున్నట్లు అవుతుంది” అని హెచ్చరించారు. పుష్కరాలు వచ్చే వరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కాలుష్యంతోపాటు అభివృద్ధి పనులపైనా సమీక్ష నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.















