అమరావతి (చైతన్య రథం): దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు చోటుచేసుకున్న ఘటనలో 10మంది మృతి చెందారు. 24మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌పీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు దాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు ఘటన సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఘటనలో పదిమంది మృత్యువాత పడ్డారన్న సమాచారం తీరని బాధకు లోను చేసిందన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సమాచారం తీవ్రమైన బాధకు లోనుచేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా బాధాతప్త సంతాపం తెలియచేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. విపత్కర సమయంలో బాధితులు, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.















