- తిరుమలలో డిపాజిట్లపై ప్రశ్నించిన బీటెక్ రవిపై అక్రమ కేసులా?
- హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్ హెచ్చరిక
అమరావతి: వినాయక చవితికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టే ముందు విఘ్నాలు తొలగించుకోవడానికి విఘ్నేశ్వరుని పూజిస్తామని, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం..శ్లోకంతో ప్రారంభిస్తా మని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం వినాయక చవితి నిర్వహించుకోవడానికే విఘ్నాలు కలిగించడం దారుణమని అన్నారు. మండపానికి అనుమతి కావాలంటే లాయర్ నోటరీ, నిమజ్జనం రూట్ మ్యాప్ , కమిటీ సభ్యులు వివరాలు ఇవ్వాలనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి మండపంలో నీరు, ఇసుక ఉండాలని చెబుతున్నారన్నారు. 3 ఏళ్లలో వైసీపీ నేతలకు తప్ప ప్రజల కంటికి ఇసుక ఎక్కడైనా కన్పించిందా అని అడిగారు. రాష్ట్రంలోని ఇసుకంతా వైసీపీ నేతలే బొక్కేశారని మండిపడ్డారు. ఇక ఇసుక ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం విధించిన ఆంక్షల్లో మండపం దగ్గర ఒక వ్యక్తి కాపలా ఉండాలన్నది ఒక్కటే సమర్ధనీయమని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండపంలోని పూజా సామాగ్రి దొంగింలించకుండా ఉండాలంటే ఈ నిబంధన సరైందేనని ప్రజలంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క మండపం ఏర్పాటు చేయాలంటే పోలీస్ స్టేషన్, ఫైర్ ఆఫీసు, మునిసిపల్ ఆఫీస్.. ఇలా ఇన్ని ఆఫీసులకు తిరగాలా అని అడిగారు. ఒక్కో స్పీకర్ కి రోజుకి వంద రూపాయలు కట్టాలనటం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వం విధించిన ఆంక్షలే కొనసాగిస్తున్నట్లు వైసీపీ నేతల వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. అంటే చంద్రబాబు నాయుడి ఫొటోతో ఇప్పుడు జీవో ఇచ్చారా అని అడిగారు. గతంలో అనుమతికి నోటరి కావాలనే నిబంధన లేదని చెప్పారు. రేపల్లె, తురకపాలెంలో టీడీపీ నేతల మండపాలకు అనుమతి ఇవ్వక పోవటం దుర్మార్గమన్నారు.
భక్తులకు అండగా టీడీపీ
ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేది లేదని, వినాయక భక్తులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో గతంలో ఎన్నడూ జరగని విధంగా విజయవాడ దుర్గగుడిలో అక్రమాలు జరిగా యని తెలిపారు. వెండి సింహాలు, చీరలు మాయమ య్యాయని, టికెట్ల అమ్మకాల్లో అవినీతి.. ఇలా ఎన్నో అక్రమాలు జరిగాయని వివరించారు. వాటిపై నాటి మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
తిరుపతిలో తిరుమల వసతి గదుల డిపాజిట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత బీ.టెక్. రవిపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయంగా పేర్కొన్నారు. కేసు పెట్టాల్సింది బీ.టెక్ రవిపై కాదని, కొండ మీద రాజకీయ విమర్శలు చేసిన మంత్రులపై, ప్రోటో కాల్ ఉల్లంఘించి ఇస్టానుసారంగా వందలాది మంది తమ అనుచరులను దర్శనానికి తీసుకెళ్లిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుమలలో వైసీపీ రంగులు వేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. ప్రభుత్వం టీటీడీ ప్రతిష్ఠ పెంచేలా వ్యవహరించాలి తప్ప, టీటీడీని రాజకీయ వేదికగా మార్చి తిరుమల ప్రతిష్ఠ మంటగలపడం సరికాదని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోమని బుచ్చిరామ్ ప్రసాద్ హెచ్చరించారు.