- బ్లూ ఎకానమీతోనే భవిష్యత్తు… ఆర్థికాభివృద్ధి సాధ్యం
- కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో భూ కేటాయింపులు
- దేశాన్ని అగ్రపథాన నిలిపేలా అద్భుతంగా పని చేస్తున్న ప్రధాని మోదీ
- సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు
- రూ.72 కోట్లతో కాకినాడ పోర్టును ఆధునికీకరిస్తామన్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్స్లో ఉంటే… దానికి ఏపీని కేంద్ర బిందువు చేస్తామన్నారు. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం,
నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ కారిడార్లో ఆక్వా అభివృద్ధికి అవసరమైన రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అతి తక్కువ వ్యయంతో అత్యధిక ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని చెప్పారు. ఆక్వా ఉత్పత్తులకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో కూడా
ఆర్థిక ప్రగతి సాధించవచ్చన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఆంధ్రా ష్రింప్, ఇండియా సీ- ఫుడ్’ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పారు. ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన నాలుగు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు ఒకే వేదికపైకి రావడాన్ని శుభపరిణామంగా అభివర్ణించారు.
రాష్ట్రంలో మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు
‘రూ.72 కోట్లతో కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ చేపడతామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించినందుకు సంతోషం, కేంద్ర మత్స్య శాఖకు ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో కేటాయిస్తాం. నెల రోజుల్లో కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. ఆక్వా ఉత్పత్తులను మరింత పెద్ద స్థాయిలో ఎగుమతులు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆక్వారంగ అభివృద్ధికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్ట్రం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పింది. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి బ్లూ ఎకానమీ ఎంతో కీలకం. పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్, బ్లూ ఎకానమీ టు వికసిత్ భారత్ అనే విధానంతో పని చేయాలి. భారత ఆశలను… ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుందని భావిస్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్ ఇండియా వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఈ రంగంలో ఇండియాకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఏటా రూ.28వేల కోట్ల ఎగుమతులు
‘భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యం. నీరు ఉన్నచోట నాగరికతలు విలసిల్లుతాయి… ఏపీలో గోదావరి, కృష్ణ వంటి జీవ నదులు ఉన్నాయి. సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతి పెద్ద రాష్ట్రం. 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి ఏపీలో జరుగుతోంది. ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే దేశ ప్రగతికి దోహదపడుతుంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28శాతంగా ఉంది. భారతదేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో ఏపీ షేర్ 66 శాతం. భారతదేశం మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు 38 శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. సంవత్సరానికి రూ.28వేల కోట్లకు పైగా సముద్ర ఆహార ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే, భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు కూడా వృద్ధి చెందుతాయి. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ముందుకు సాగుతుంది. ఏపీలో 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఏపీలో పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఏ రంగం, ఏ ఉత్పత్తి అయినా సక్సెస్ కావాలంటే క్వాలిటీ, సస్టైనబుల్టీ, ట్రేసబులిటీ, ఇన్నోవేషన్, జీరో పొల్యూషన్ అనేది ముఖ్యం. సీ-ఫుడ్ ఎగుమతుల అభివృద్ధికి ప్రతీ స్టేక్ హోల్డర్ బాధ్యత తీసుకోవాలి, సహకరించాలి.’ అని సీఎం కోరారు.
ప్రధాని మోదీని మరింత బలపరుద్దాం. ‘ఆక్వా పరిశ్రమలో ఇన్నోవేషన్లు చేసే వారిని ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఏపీ పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే.. ఆ పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చి… అభివృద్ధి చేస్తాం. ఆక్వా ఉత్పత్తులతో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ప్రజలు ఇప్పుడు ప్రొటీన్ ఉత్పత్తులనే ఆహారంగా తీసుకుంటున్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడంతో పాటు… రోజూ సైక్లింగ్ చేయాలి. ఇవాళ ఈ సమావేశానికి సైక్లింగ్ చేసుకుంటూనే వచ్చాను. సైకిల్ తొక్కితే ఆరోగ్యం బాగుంటుంది… ఖర్చులూ తగ్గుతాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. సరైన సమయంలో సరైన నేత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటం అదృష్టం. 21వ శతాబ్దం నరేంద్ర మోదీదే… భవిష్యత్తులో భారతదేశాన్ని అగ్ర భాగంలో నిలపడానికి ఆయన అద్భుతంగా పని చేస్తున్నారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉంది.’ అని చంద్రబాబు చెప్పారు.
కొత్త మార్కెట్లకు భారత ఆక్వా ఉత్పత్తులు
ఆక్వా రంగం అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆక్వా రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం సంక్షోభం నుంచి అవకాశాలను అన్వేషిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ… గతేడాది కంటే మిన్నగా ఆక్వా ఎగుమతులు చేసుకోగలిగామని, అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లకు భారత ఆక్వా ఎగుమతులు వెళ్లాయన్నారు. ఇప్పుడు మన ఆక్వా ఉత్పత్తులకు మరిన్ని మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆక్వా ఎగుమతులతో ఆర్థికాభివృద్ధితో పాటు మత్స్యకారులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. మోడ్రనైజ్డ్ బోట్లను మత్స్యకారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, 200 మోడ్రనైజ్డ్ బోట్లు ఏపీకి వస్తున్నాయని చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లు మారాయి. ప్రొటీన్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఎక్కువ ఉండటం వల్ల ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
సీ-ఫుడ్ ప్రాసెసింగ్ లో విస్తృత అవకాశాలు
ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘ఆక్వాలో కేవలం 12 శాతం మాత్రమే ప్రాసెసింగ్ చేస్తున్నాం… సీ-ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరింత అభివృద్ధి చేయాలి. ఆక్వాలో టెక్నాలజీ, ఇన్నోవేషన్లకు పెద్దపీట వేయాలి. వ్యవసాయంతో పోల్చుకుంటే ఆక్వాలో ఎక్కువ అభివృద్ధి కనిపిస్తోంది. ఆక్వాకు రూ.1.50కే విద్యుత్ ఇస్తున్నాం. ఫిష్ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫిష్ మీల్ ఎగుమతులను 50శాతానికి పరిమితం చేయాలని కోరుతున్నాం. సోయా విషయంలోనూ కేంద్రం నుంచి సహకారం అవసరం. ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరగాల్సి ఉంది. దీనికి కేంద్రం ఇప్పటికే సహకరిస్తోంది. ప్రపంచంలోని ప్రతీ కిచెన్లోకి ఇండియన్ ఆక్వా ఉత్పత్తులు వెళ్లేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించడం సంతోషంగా ఉంది.’ అన్నారు.
సర్కులర్ ఎకానమీతో ‘ఆక్వా’ అనుసంధానం
‘పీఎంఎంకేఎస్ఎస్వీ (వీవీఖూ) పథకాన్ని ఏపీలో అమలు చేస్తాం… విశాఖ ఫిషింగ్ హార్బర్లో సమస్యలుంటే పరిష్కరిస్తాం… ఏడాది 30 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. దాంట్లో 30 శాతం ఏపీ వాటా ఉంటుందని హామీ ఇస్తున్నాం. సర్కులర్ ఎకానమీకి ఆక్వా రంగాన్ని అనుసంధానం చేసేలా భీమవరంలో ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తోంది. మార్కెట్ ఇబ్బందులతో మద్దతు ధర కోల్పోయిన వివిధ పంటల రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గౌరవం దక్కడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీనే. చాలా దేశాల్లో చాలా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. భారత దేశాన్ని ప్రధాని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహిస్తోంది. అమెరికాలో నాలుగు పవర్ గ్రిడ్లు ఉన్నాయి. భారతదేశంలో ఒకే సెంట్రల్ పవర్ గ్రిడ్ ఉంది. భారత దేశంలో ఏ మారుమూల విద్యుత్ ఉత్పత్తి చేసినా… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ 2014 తర్వాతే జరిగాయి. గతంలో సోలార్ విద్యుత్ యూనిట్కు ఉత్పత్తి వ్యయం రూ.14గా ఉండేది. ఇప్పుడు యూనిట్ కు రూ.2.40కు వ్యయం తగ్గింది. గతంలో సోలార్ ప్యానెళ్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రధాని మోదీ నిర్ణయాలతో ఇప్పుడు ఏపీలో సోలార్ ప్యానెళ్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం.’ అన్నారు.














