అధికారంలోకి రావటానికి “అబద్దపు హామీలు ఇవ్వటం.. ఆ తరువాత వాటిని తుంగలో తొక్కటం”.. ఇదీ ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి నైజం. అధికారంలోకి రావటమే లక్ష్యంగా 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి “ఇవ్వని హామీ లేదు.. చెప్పని అబద్దం లేదు”. అందులో ముఖ్యమైనది ” దశల వారీ మద్య నిషేధం. నవరత్నాల్లో ఇదొక రత్నమంటూ మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి.. లక్షలాది మంది మహిళలను బుట్టలో వేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక.. మాటతప్పి.. మడం తిప్పి.. మద్య నిషేధం హామీని చెత్త బుట్టలా దాఖలు చేశారు. లక్షలాది మంది మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు. నమ్మక ద్రోహానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.
జగన్ మోహన్ రెడ్డి.. మాయ మాటలతో వంచించటంలో ఇతనికి మించిన వారు మరెవరూ ఉండరనటంలో అతిశయెక్తి లేదేమో. ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం.. జనం సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ.. రాజకీయ పబ్బం గడుపుకోవటంలో దిట్ట ఈయన. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి జగన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. నోరు విప్పితే అబద్దాలు చెప్పే జగన్ రెడ్డి.. అన్ని వర్గాల ప్రజల్నీ తన తప్పుడు హామీలతో వంచించారు. కోట్లాది మంది మహిళల్ని సైతం తన గారడీ మాటలతో బురిడీ కొట్టించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తానంటూ ఊరూవాడా తిరుగుతూ ఊదరగొట్టారు. మద్యం అమ్మకాలే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేస్తానంటూ.. ఆనాడు జగన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను.. అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు నిజమనుకుని నమ్మారు. ఒక్క ఛాన్స్ అంటూ.. ఊరూరా ఓట్లు అడుక్కున్న జగన్ రెడ్డికి ఓటేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక.. జగన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.
పాముకు పాలు పోసి పెంచినా.. కాటు వేయటం దాని నైజం అన్నట్టు.. జగన్ రెడ్డి వ్యవహారశైలి కూడా అలాగే తయారైంది. తనను నమ్మి ఓట్లేసిన.. మహిళలకు వెన్ను పోటు పొడిచిన ఆయన.. ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధానికి తూట్లు పొడుస్తూ వస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం అమ్మకాలను పరిమితం చేస్తానన్న ఈ పెద్ద మనిషి.. వాడవాడలా ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి.. విచ్చల విడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం షాపులను, అమ్మకాలను తన గుప్పెట్లోనే పెట్టుకుని.. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. నాసిరకం మద్యాన్ని సైతం అధిక ధరలకు విక్రయిస్తూ.. మద్యం వినియోగదారుల జేబులను, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. దేశంలోని ఎక్కడా లేని పనికి మాలిన బ్రాండ్లను వినియోగదారులకు అంట గడుతున్న జగన్ రెడ్డిని మహిళా లోకం ఈసడించుకుంటోంది. ఇలాంటి వ్యక్తినా.. తాము నమ్మి ఓట్లేసింది..? అని దుమ్మెత్తి పోస్తోంది.
ఇక.. దశల వారీగా మద్య నిషేదం అమలు చేస్తామన్న జగన్ రెడ్డి.. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. మద్య నిషేదం పేరుతో గద్దెనెక్కిన వ్యక్తి.. ఇలా చేయటాన్ని చూసి.. యావత్ ఆంధ్రదేశం నోరు వెళ్ళబెట్టింది. అంతే కాదు.. గత నాలుగేళ్లలో సుమారు లక్ష కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగించిన రికార్డు కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మద్యంపై ఆదాయం సంపాదించవద్దా..? అని నిండు సభలో ప్రశ్నించిన తెంపరితనం కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిస్సిగ్గుగా వంచించిన..జగన్ రెడ్డి నేటికీ అవే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. మద్యపాన నిషేదం ఎప్పుడు చేస్తారంటే.. తనకు అలవాటైన కట్టుకథలనే వల్లె వేస్తున్నారు.
“దశల వారీగా మద్యపాన నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం” అని జగన్ రెడ్డి చాలా సార్లు నమ్మబలికారు. ప్రస్తుతం అతను అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు దాటుతోంది. మరో ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి మద్యపానం నిషేదం ఎప్పుడు చేస్తావ్..? జగన్ ..? అని తెలుగు ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా తమ భర్తలను తాగుబోతులుగా మార్చిన జగన్ పై తెలుగింటి ఆడపడుచులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈసారి మద్యపాన నిషేధం గురించి జగన్ మాట్లాడితే.. తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు.