అమరావతి (చైతన్య రథం): తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లేఖలో గుర్తుచేశారు.
ఈమేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకి రాసిన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీనుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (ఎస్ఇడి), (రూ.300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు రాసిన లేఖలో స్పష్టం చేశారు.