- రియల్ ఎస్టేట్‌తోనే ఆర్థిక ప్రగతి
- క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే టౌన్ ప్లానింగ్ సంస్కరణలు
- అన్ని శాఖల అనుసంధానంతో అనుమతులు మరింత సులభతరం
- పురపాలకశాఖ మంత్రి నారాయణ
నెల్లూరు (చైతన్యరథం): టౌన్ ప్లానింగ్ రంగంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేస్తేనే రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుందని పురపాలక. పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. భారతదేశంలో తొలిసారిగా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, ప్రస్తుతం తెస్తున్న 2.0 అప్‌గ్రేడ్‌తో అన్ని శాఖల అనుసంధానం 3 నుంచి 6 నెలల్లో పూర్తవుతుందని ప్రకటించారు.
నెల్లూరులో ఆదివారం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (డబ్ల్యూఏఎల్టీపీ ఏపీ) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు కావలిలో 100 శాతం ఇళ్ల వెరిఫికేషన్, నెల్లూరులో లేఅవుట్లు, తెనాలి సహా పలు పట్టణాల్లో పరిశీలించి ఈ సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పరిశ్రమలు రావాలన్నా కనీస మౌలిక సదుపాయాలు, ఇళ్లు తప్పనిసరని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రియల్ ఎస్టేటర్లు, లైసెన్స్ సర్వేయర్లు, ఇంజినీర్లతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు ద్వారా దశలవారీగా అమలు చేసిన ఆన్లైన్ విధానాన్ని నేడు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ప్రస్తుతం ఫైర్, రెవెన్యూ, ఇరిగేషన్, వక్ఫ్ బోర్డ్, ఎయిర్పోర్ట్, సీకోస్ట్ అథారిటీల సాఫ్ట్వేర్లను అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని వివరించారు.
చివరగా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సచివాలయంలో తనను నేరుగా కలవవచ్చని, తప్పకుండా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డబ్ల్యూఏఎల్టీపీఏపీ ఈ కార్యక్రమంలో మేయర్ విజేత రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర స్థాయి నుండి డబ్ల్యూఏఎల్టీపీ ఏపీఅధ్యక్షుడు ఎం. ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. హిదయతుల్లా, సంయుక్త కార్యదర్శి ఎన్. మల్లికార్జున రెడ్డి, కోశాధికారి సి.హెచ్. శ్రీనివాస్ కుమార్, రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు పి.వి.ఎన్. మాణిక్యాల రావు హాజరయ్యారు. వీరితో పాటు నెల్లూరు అసోసియేషన్ నుండి ప్రధాన కార్యదర్శి కె. రవి కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.కె. అల్తాఫ్, సంయుక్త కార్యదర్శి ఇంతియాజ్ బాబు, కోశాధికారి ఎ. వెంకటేష్, మరియు ఈసీ సభ్యుడు టి.పి. చిట్టి బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.




















