- ఈ ఏడాది వర్షాలు తగ్గినా నీటి సమస్య రానివ్వలేదు
- రెండేళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తికావాలి
- ప్రాధాన్యంతో శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులు
- భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్లు
- జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకూడదని… అన్ని కాలాల్లోనూ జల వనరులు సమృద్ధిగా లభించేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా, ఎగువ రాష్ట్రాలనుంచి వరద జలాలు రాకున్నా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువుగా నమోదైందని, అయినప్పటికీ ఎక్కడా నీటి సమ్యస్య ఉత్పన్నం కానివ్వలేదని సీఎం అన్నారు. ఇది కేవలం సమర్ధ నీటి నిర్వహణతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భజలాలు… తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం 1,031 టీఎంసీ నీటి నిల్వలు
రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా.. ఇప్పటివరకు 1,031 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల్లో 79 శాతం నీరు నిల్వ ఉందన్నారు. సెప్టెంబర్ మొదటివారానికే ఈ స్థాయికి నిండాయని వివరిస్తూ.. ఇందులో శ్రీశైలం సహా మేజర్ ప్రాజెక్టుల్లో 89 శాతంమేర, మీడియం జలాశయాలు 57 శాతం, మైనర్ ప్రాజెక్టుల్లో 39 శాతంమేర నీటి నిల్వలు ఉన్నాయన్నారు. సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్ నింపే విషయంలో సమస్యలను పరిష్కరించాలని సీఎం అన్నారు.
38,457 చెరువులు నింపేలా చర్యలు
రాష్ట్రంలో 38,457 చెరువులకు గాను… 32,642 చెరువులను ఇంకా పూర్తిగా నింపాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని 497 చెరువులకుగాను 51 చెరువులు పూర్తిగా నిండాయని అధికారులు తెలిపారు. అన్ని చెరువులు వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని 89,117 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రూ.6,518 కోట్ల వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిద్వారా 2,81,139 ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు, 3,38,326 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుందన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశంధార ప్రాజెక్ట్, సర్దార్ గౌతు లచ్ఛన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్, తారకరామ తీర్థ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్ట్, గాలేరు నగరి సుజల స్రవంతి పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 108 కి.మీ.మేర పూర్తి చేసి కడప వరకు జలాలు తీసుకువెళ్లేలా, పనులు నిలిచినచోట్ల మళ్లీ టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. రూ.1,686 కోట్లతో చేపట్టిన శ్రీశైలం డ్యామ్ రక్షణ పనులు, ఎస్కేప్ చానల్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిస్తూ.. పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2 వేల కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయండి. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇస్తాం. అటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్… ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. ఇలా రెండువైపులా పంపులతో విశాఖ నగరానికి ప్రాజెక్టులు విస్తరించాలి. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపడం ద్వారా ఉత్తరాంధ్రలో వాటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. ఇది ఉత్తరాంధ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఏలేరు పూర్తిగా నింపాలి. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని తరలించడానికి ఏలేరు ఎంతో కీలక’మని చంద్రబాబు పేర్కొన్నారు.
ముందుగా వరికపూడిసెల ఫేజ్ 1 పనులు
హెడ్ వర్క్స్ వినా.. వరికపూడిసెల ఫేజ్`1లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి 24,900 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అలాగే ఫేజ్`2 పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సాధించాలని ఆదేశించారు. రెండు దశలు పూర్తి చేయడానికి రూ.1,925 కోట్లు వ్యయం కానుండగా, 84,281 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గతేడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 మీటర్లమేర భూగర్భజలాలు పెరిగాయి. సెప్టెంబర్ 1నాటికి సగటు భూగర్భజలాలు 8.43 మీటర్లుగా ఉన్నాయి. భూగర్భజలాలు 8 మీటర్ల కంటే దిగవకు ఉన్న 7,762 గ్రామాల్లో వాటి పెంపునకు ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్‌ల నిర్మాణంవంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే భూగర్భ జలాల సమాచారం రియల్ టైమ్‌లో స్పష్టంగా తెలుసుకునేందుకు వచ్చే 3 నెలల్లో కొత్త సెన్సర్ల ఏర్పాటు పూర్తిచేయాలని నిర్దేశించారు. సమీక్షా సమావేశంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.