- కీలకసాక్షి రంగన్న మృతిపై ఎన్నో అనుమానాలు
- ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ముద్దాయిలను విచారించాలి
- మీడియాతో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి
అమరావతి (చైతన్యరథం): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దృశ్యం సినిమా మాదిరిగా సాగుతూనే ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదని గుర్తు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్యకేసులో కీలక సాక్షి వాచ్‌మెన్ రంగన్న ఇటీవల మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పరిటాల రవి హత్య కేసులో వరుస మరణాలు చూసినట్లే వివేకా హత్య కేసులోనూ నిందితుల మరణాలు కొనసాగుతున్నాయి. వివేకా హత్య కేసులో ఇప్పటికే కసనూరు శ్రీనివాస్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, ఈసీ గంగి రెడ్డి, అభిషేక్ రెడ్డి వంటి కీలక సాక్షులు మృతి చెందారు. యువకుడైన అభిషేక్ రెడ్డి నాలుగు నెలలు కోమాలో ఉండి మరణించారు. ఇలా మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
2019లో ‘నారసుర రక్త చరిత్ర’ అంటూ కట్టుకథలు అల్లి వైసీపీ అధికారంలోకి వచ్చింది. హత్యలు చేయడం, కట్టుకథలు అల్లడం జగన్ రెడ్డికి అలవాటు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే రంగన్న మృతి చెందారని సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వివేకా హత్య కేసు ముఖ్యసాక్షి రంగన్నను హింసించింది. వివేకాను హత్య చేసి పారిపోయిన నిందితులను కళ్లారా చూశాను అని వాచ్‌మన్ రంగన్న చెప్పిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. వివేకా హత్య అనంతరం సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి గోడ దూకి పారిపోగా, ఎర్ర గంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం ద్వారా బయటకు వచ్చాడు. ఈ విషయం వెల్లడిస్తే చంపేస్తామని బెదిరించారని వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో రంగన్న మృతి ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో సాక్షుల మరణాల వెనకున్న మిస్టరీపై సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను బహిర్గతం చేయాల్సివుంది. 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉంటే, ఇప్పటికే దోషులను పట్టుకుని ధర్మాసనం ముందు నిలబెట్టేవారు. రాజకీయ ఆధిపత్యం సొంత బంధువులే వివేకానంద రెడ్డిని హత్య చేశారనే విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసునని శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు.
సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం
ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. వివేకా కుమార్తె సునీత కూడా న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. పోలీసుల వేధింపులు తాళలేక, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక వాచ్‌మన్ రంగన్న చనిపోయాడని సాక్షి పత్రికలో రాశారు. వాచ్‌మన్‌్ రంగన్నను వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు తీసుకువెళ్లి అనేక రకాలుగా చిత్ర హింసలు పెట్టారు. వైసీపీ నాయకులు చెప్పినట్లుగానే మాట్లాడాలంటూ హింసలు పెట్టిన విషయం వాస్తవం కాదా? కాగా నేడు పోలీసులు వేధించారనడం శుద్ధ అబద్ధం. ప్రజలను మభ్య పెట్టడానికి ఏదంటే అది మాట్లాడడం సబబుకాదు. వివేకా హత్య జరిగి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ కేసును సాగదీస్తారు? ఇప్పటికే ఐదారుగురు సాక్షులు చనిపోయారు. చివరికి ఎంతమంది చనిపోతారో తెలియదు. వాచ్‌మన్‌్ రంగన్న మృతదేహానికి పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం జరగాలి. ఎక్కడ అనుమానాలకు తావు లేని విధంగా పోస్ట్‌మార్టం జరగాలి.
జిల్లా పోలీసు, రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తి పర్యవేక్షణ చేయాలి. ఈ కేసులో నిజమైన దోషులను పట్టి శిక్షించాలి. వివేకా హత్యకేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ముద్దాయిలను కూడా రంగన్న మృతి విషయంలో విచారించాలి. ఈ రోజు కొత్తగా పోలీసుల వేధింపులు తట్టుకోలేక రంగన్న చనిపోయాడు అని మాట్లాడడం అవివేకం. అభూత కల్పనలతో అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాలో కట్టుకథలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయనే విషయాన్ని వైసీపీ వాళ్ళు గ్రహించాలి.
ఈ కేసులో కీలక సాక్షి, వైఎస్సార్ కుటుంబానికి చెందిన జగన్ దగ్గరి బంధువు అభిషేక్ రెడ్డి కూడా ఇటీవలే హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుడైన అభిషేక్ రెడ్డి నాలుగు నెలలు కోమాలో ఉండి చనిపోయాడంటే ఇది అనుమానాస్పద మృతి కాదా? వివేకాను హత్య చేసింది సొంత బంధువులే.
వీళ్ళందరూ కూడా కుటుంబంలో చిచ్చు పెట్టుకొని ఒకరినొకరు ఆ రాజకీయ ఆధిపత్య పోరులో వివేకానంద రెడ్డిని బలి చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వాచ్‌మన్ రంగన్న మృతిపై పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం సీనియర్ డాక్టర్ల నేపథ్యంలో జరగాలి. దృశ్యం సినిమా మాదిరిగా ఈ కేసు ముగిసిపోకుండా వాస్తవాలు బయటకు రావాలి. నిజమైన దోషులకు శిక్ష పడాలని పోలీసులను, ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.