- జీడీపీలో అత్యధిక వాటా సాధించడమే లక్ష్యం
- ఏపీని చూస్తే దేశం అంతటినీ చూసినట్టే
- పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
- రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
రాజమండ్రి(చైతన్యరథం): పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆదివారం
రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పర్యాటక రంగ అభివృద్ధిపై సుదీర్ఘంగా ప్రసంగించారు. గత రెండున్నర ఏళ్లలో చేపట్టిన పర్యాటకరంగ అభివృద్ధిని, రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే ప్రణాళికలను సవివరంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చొరవతో పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించడం తో భారీగా ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. తద్వారా
కేవలం రెండున్నర ఏళ్ల కాలంలోనే 20 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం శుభపరిణామం. పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం’నూతన పర్యాటక పాలసీ (2024-29), ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ పాలసీ, కారవాన్ టూరిజం, హోంప్టే, బ్రెడ్ అండ్బ్రేక్ ఫాస్ట్ పాలసీ తదితర అనుబంధ పాలసీలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఉన్న వనరులను
అందుబాటులోకి తేవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక తలను వినియోగిస్తున్నాం. ‘ఎక్స్పర్టర్’సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో పర్యాటక ప్రాంతాల విశిష్టతను 130 భాషల్లో, 100కు పైగా పర్యాటక ప్రాంతాల విశిష్టత సులభంగా తెలిసేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
పారిశ్రామిక రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించేది పర్యాటక రంగమే. చదువుకున్న వారికే కాకుండా చదువుకోని స్థానికులకు, టూరిస్ట్ గైడ్లు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకా శాలు మెండుగా లభిస్తాయి.
ఉపాధిని కల్పించే ఇన్వెస్టర్లకు ప్రభు త్వం ప్రత్యేక రాయితీలు ఇస్తోందని, యువత తమ భవిష్యత్తు కోసం పర్యాటక రంగాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఉన్న ప్రదేశాలన్నీ ఏపీలో ఉన్నాయి
భారతదేశంలో ఉన్న ప్రదేశాలన్నీ ఏపీలోనే ఉన్నాయని, ఏపీని చూస్తే భారతదేశం అంతటినీ చూసినట్టేనని పేర్కొన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం, పంచారామాలు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు అరకు, బొర్రా గుహలు, బెలూన్ గుహలు, మారేడుమిల్లి, లంబసింగి, గండికోట వంటి ప్రకృతి సౌందర్య ప్రదేశాలు ఎకో టూరిజానికి పెద్దపీట వేస్తున్నాయన్నారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ సైతం తన సినిమాలో ఒక షాట్ను మారేడుమిల్లి దగ్గర తీయాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీకి సొంతమైన అరకు కాఫీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన వైనం, మారేడుమిల్లి బాంబో చికెన్, ఆయుర్వేదం, యోగ, ప్రకృ తి వైద్యం ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పటివరకు 21 వస్తువు లకు జీఐ ట్యాగ్ కల్పించామని చెప్పారు.
గోదావరి పుష్కరాలకు కర్టెన్ రైజర్ కార్యక్రమం
2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఇది కర్టెన్ రైజర్ కార్యక్రమం అని పేర్కొంటూ ‘గోదావరి పిలుస్తోంది – ది గోదా వరి కాల్స్’ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించి గోదావరి పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని, ఆంధ్ర వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా హేపలాక్ వంతెన పుష్కర్ ఘాట్ అభివృద్ధి, కడియం నర్సరీలు, నిడదవోలు, శెట్టిపేట, కోట సత్తెమ్మ దేవాలయాల అభివృద్ధిని చేపడుతున్నాం. బ్రిడ్జ్ లంకలో టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 8. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా రూ.428 కోట్లు కేటా యించిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం
పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో పర్యటించి గోదావరి ప్రాంతాలపై రూపొందించిన వీడియోలను విశ్వవ్యాప్తం చేస్తున్నామని తెలిపారు. జీడీపీలో పర్యాటక రంగం ద్వారా అత్యధిక వాటా సాధించ డమే లక్ష్యంగా అటవీ, ఇరిగేషన్, ఆర్అండ్్బ, ఎండోమెంట్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ. ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు, హోటల్స్ అసోసియేషన్, ట్రావెల్స్ ఆపరేటర్స్, ఏపీ ఛాంబర్స్ పర్యాటక అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్, టూరిజం ఎండీ పట్టాన్ శెట్టి రవి సుభాష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాజమహేంద్ర వరం మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సబ్ కలెక్టర్ ఆదిత్య శర్మ, ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్రావు, ఏపీ ట్రావెల్స్ ఆపరేటర్స్. ప్రెసిడెంట్ విజయ్ మోహన్, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి, టూరిజం డైరెక్టర్లు వాసురెడ్డి రాంబాబు, గంటా స్వరూప, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పర్యాటక రంగ ప్రతినిధులు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పర్యాటక రంగ ఏవీ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విజేతలకు అతిథులు అవార్డులు ప్రదానం చేశారు.














