- పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం
- అమరావతి నిర్మాణాలకు భారీగా నిధులు
- విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలు
- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
- 30 కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఊతమిచ్చేలా మొత్తం 30 అంశాలకు ఆమోదముద్ర వేసింది. పరిశ్రమల ఏర్పాటులో అనుమతుల జాప్యాన్ని నివారించేలా ‘ఏపీ ఎంఎసఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026’కు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం
పెనుకొండలో రూ.19 వేల కోట్ల పెట్టుబడితో కియా రెండో ఆటోమొబైల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనకు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,800 కోట్లతో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ స్థాపనకు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఎంఎసఎంఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు ‘ఏపీ ఎంఎసఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026’కు ఆమోదం తెలిపింది. కొత్త పరిశ్రమల ఏర్పాటులో అధికారిక అనుమతుల కోసం ఎదురుచూసే సమయాన్ని తగ్గించి, పెట్టుబడిదారులకు సులభతరమైన వాతావరణం కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
అమరావతి నిర్మాణాలకు భారీగా నిధులు
రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు, శాసనసభ, సచివాలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధుల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని గతంలో ఉన్న రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచింది. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,215 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది. శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈ పనుల ద్వారా రాజధాని ప్రాంతంలో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన రంగంలోనూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఏపీజెన్కోకు అనుమతి ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు 1,127 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ఆమోదం తెలిపింది.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 4,352 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రైల్వేకోడూరు పరిధిలోని 10,192 ఎకరాల భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు అనుమతించింది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వివాదాల్లో ఉన్న భూముల విషయంలో కొత్తగా ఎలాంటి హక్కులు కల్పించకుండా తగిన నిబంధనలు పాటించాలని నిర్ణయించింది. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇతర పారిశ్రామిక ప్రతిపాదనలు
పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించే దిశగా కోసలనగరం ఇండస్ట్రియల్ పార్కుకు రూ.1,500 కోట్ల రుణ ప్రతిపాదన, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ కెమికల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు రాజధాని నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది.



















