- మార్కెట్‌ను బట్టి గిట్టుబాటు ధరకు చర్యలు
- మిల్లర్లకు గత బకాయిలు రూ.361 కోట్లు
- వారు నిర్లక్ష్యం వహిస్తే కేసులు నమోదు
- తేమ శాతం నిర్ధారణకు ఒకే కంపెనీ మిషన్లు
- నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వ రవాణా,
- హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం
- కౌలు చట్టంలో మార్పులతో రైతులకు మేలు
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
- సంగంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
- పాల్గొన్న మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు/సంగం(చైతన్యరథం): రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఉదయం నెల్లూరు జిల్లా సంగం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో కలిసి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలో రూ.20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. రైతులకు మార్కెట్‌ను బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతాన్ని నిర్ధారించేందుకు ఒకే కంపెనీ మిషన్లు అందుబాటులో తీసుకొస్తామన్నారు. ప్రతి మండలానికి కూడా ఒక డ్రయర్ అందించేందుకు, ఉపాధి హామీ నిధులతో ప్రభుత్వ భూముల్లో సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 50 శాతం సబ్సిడీతో టార్ఫాలిన్ పట్టలను రైతులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు జరిగేలా కౌలు రైతు చట్టంలో మార్పులు చేస్తూ రైతు భరోసా వచ్చేలా నూతన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా 30 లక్షల గోతాలను అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులు చేసి 5.87 లక్షల మంది రైతు లకు 24 గంటల్లో రూ.7480 కోట్లు జమచేసినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాం
గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో రూ.32 కోట్ల రైతుల సొమ్ముని స్కామ్ చేసి దోచేశారన్నారు. గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను మోసం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.361 కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ.10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభు త్వం ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకుండా రూ.1674 కోట్లు బకాయి పెట్టగా వాటిని కూడా చెల్లించడం జరిగిందని వివరించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలీ చార్జీలు రూ.1.40 కోట్లు రెండురోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గత ఏడాది కంటే ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసి 24 గంటల్లోపే డబ్బులు చెల్లించామని చెప్పారు. రైసుమిల్లుల యజమానులు బాధ్యతగా పనిచేయాలని..రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు.
వచ్చే నెల నుంచి మరో 300 కేంద్రాలు
నెల్లూరు జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మార్చి ఒకటో తేదీ నుంచి జిల్లాలో సుమారు 300 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, 25 లక్షల ధాన్యాన్ని పీడీఎస్ బియ్యానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉంటే ఒక కిలో నుంచి ఐదు కిలోల వరకు మాత్రమే ధాన్యం తీసుకోవాలని, అంతకు మించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మూడు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఒక్కొక్కరికి లక్ష చొప్పున 1871 మందికి ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సన్నబియ్యాన్ని సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆత్మకూరు అభివృద్ధికి రామనారాయణరెడ్డి పట్టుదలతో పనిచేస్తున్నారని, వందల కోట్ల నిధులను వెచ్చిస్తున్నారని చెప్పారు.
తమ పూర్తి చేస్తే వారి పేర్లు పెట్టుకున్నారు: ఆనం
దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరుతో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు మంచి అనుబంధం ఉందని నాటి విషయాలు గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల పడిన బాధలు వర్ణణాతీతమని చెప్పారు. ధాన్యం అమ్ము కోవాలంటే రైసుమిల్లుల వద్ద నాలుగైదు రోజులు తిండితిప్పలు లేకుండా అవస్థలు పడ్డా రని వివరించారు. ఆ ప్రభుత్వంలో పడిన కష్టాలు పడకుండా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సంగం, నెల్లూరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుని ప్రారం భోత్సవాలు చేసుకుందన్నారు. అయినా పూర్తిస్థాయిలో పనులు చేయలేదన్నారు. సంగం రోడ్డు కం బ్యారేజ్‌ని నిర్మించేందుకు తాను ఆర్థికమంత్రిగా 130 కోట్లు మంజూరు చేస్తే కేవలం సంగం బ్యారేజ్‌ను మాత్రమే పూర్తి చేసి రోడ్డును నిర్మించలేదన్నారు. ఈ రోడ్డును పూర్తి చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. సీఎంతో కూడా ఈ విషయమై చర్చించినట్లు చెప్పారు. మెట్టప్రాంతాన్ని డెల్టాగా మార్చి పుష్కలంగా పంట లు పండేలా సమృద్ధిగా నేడు సాగునీరు రైతులకు అందేలా చేశామన్నారు. సంగంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని గతంలో రాజకీయ కేంద్రంగా వినియోగించుకుంటే తాము రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. బ్యారేజ్ వద్ద బ్రిడ్జిని పూర్తిచే యాలని, ఆత్మకూరు ఐటీఐ కళాశాలను సంగంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం : వేమిరెడ్డి
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభు త్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారని, 11 మిలి యన్ టన్నుల ధాన్యం పండే అవకాశం ఉందన్నారు. ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు జిల్లాలో వ్యవసాయ గోడౌన్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 78 సహకార సంఘాలు ఉన్నాయని, వీటి పరిధిలో దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయించుకునేందు కు జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. రైతుకు మంచి గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేముల పాటి అజయ్‌కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరా మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీసీవో గుర్రప్ప, ఎన్‌డీసీసీ బ్యాంకు సీఈవో శ్రీనివాసరావు, సంగం పీఏసీఎస్ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, సీఈవో దస్తగిరి అహ్మద్, తహశీల్దార్ సోమ్లానాయక్, సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.