- కోట్ల రూపాయల నిధులతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
- రెండేళ్లలో ‘నేరడి బ్యారేజ’ పూర్తికి సీఎం స్పష్టమైన ఆదేశాలు
- రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి
- సుదీర్ఘంగా సాగిన నీటిపారుదల అభివృద్ధి బోర్డు అత్యవసర భేటీ
శ్రీకాకుళం (చైతన్య రథం): జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా నీటిపారుదల అభివృద్ధి బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ వంటి అపారమైన నీటి వనరులు కలిగిన వ్యవసాయ ఆధారిత జిల్లా అని పేర్కొన్నారు.
గత 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో వంశధార, తోటపల్లి, మడ్డువలస, మహేంద్రతనయ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి పనులను శరవేగంగా పరుగులు పెట్టించామని మంత్రి గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే దీన్ని ఒక సవాల్‌గా తీసుకుని, కేవలం మూడు నెలల కాలంలోనే ప్రత్యేక నిధులు మంజూరు చేసి, కాలువల పూడిక తీయించి శివారు ప్రాంత భూములకు సైతం సాగునీరు అందించగలిగామని తెలిపారు.
ప్రస్తుత సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించామని మంత్రి వెల్లడించారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా చెరువులకు మళ్లించి, చివరి భూముల వరకు నీరందించేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అంతర్రాష్ట్ర (ఒడిశా) అడ్డంకులన్నింటినీ అధిగమించామని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. గరిష్టంగా రెండు సంవత్సరాల కాలంలో నేరడి బ్యారేజ్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇందుకు సంబంధించిన అంచనాలు, డీపీఆర్ సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ప్రకటించారు.
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను శరవేగంగా పూర్తి చేసి 2027 ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. వంశధార ఫేజ్-2 పనులు 2019 నాటికే 97 శాతం పూర్తయ్యాయని, కేవలం 3 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. వంశధార నదిపై గల లిఫ్ట్ నీటిపారుదల ప్రాజెక్టును ప్రజల సొమ్ము వృథా కాకూడదనే ఉద్దేశంతో ఈ ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జలధార కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వర్షాలకు ముందు భూగర్భ జల మట్టం 8 మీటర్లు, వర్షాల తర్వాత 3 మీటర్ల మేర ఉండేలా శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరిచ్చే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పునరుద్ఘాటించారు.













