- 151 సీట్లు 11 అయ్యాయి
- ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించాలి
- జనానికి జవాబుదారీగా ఉండాలి
అమరావతి(చైతన్యరథం): ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి నిరంతరం వారికి అందుబాటులో ఉండాలని ఎన్డీఏ కూటమి తరఫున గెలుపొందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. పదవి వచ్చిందనే అహంకారంతో విర్రవీగరాదన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బుధవారం ఉండవల్లిలోని నివాసంలో లోకేష్‌ని మర్యాదపూర్వకంగా కలిసి కూటమి విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా భారీ మెజారిటీతో అద్భుత విజయం సాధించినందుకు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయానికి దోహదపడిన కారణాలను నేతలతో లోకేశ్ పంచుకున్నారు. ఘన విజయం సాధించిన అందరినీ లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అద్భుతంగా పోరాడి గెలిచామంటూ అభినందనలు తెలియజేశారు. ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే 151 సీట్లు 11 అయ్యాయి. గెలుపొందిన ప్రతీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని లోకేశ్ వారికి సూచించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రధానంగా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో మంచినీటి సమస్య, కర్నూలు లాంటి జిల్లాల్లో వలసల నివారణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. ఈ మేరకు గెలుపొందిన వారందరూ కష్టపడి పని చేసి పార్టీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. లోకేశ్‌ను కలిసిక వారిలో పల్లా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, పితాని పత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, భాష్యం ప్రవీణ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, గద్దె రామ్మోహన్‌రావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ధూళిపాళ్ల నరేంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, కేశినేని చిన్ని, వంశీకృష్ణ యాదవ్, సుందరపు విజయకుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పశ్చిమగోదావరి జిల్లా నేతలు తోట సీతామహాలక్ష్మి, మంతెన శివరామరాజు, నెల్లూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య, పిఠాపురం నాయకుడు ఎస్‌వీఎస్‌ఎస్ వర్మ, తదితరులున్నారు.