ఆయన మృతి తీరని లోటు: చంద్రబాబు
అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. ఈనాడు గ్రూపు సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి… ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని అన్నారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రామోజీరావుతో తన 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో తాను రామోజీ సూచనలు, సలహాలు తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. రామోజీ అస్తమయంపై ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
“
రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: అచ్చెన్నాయుడు
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అన్నారు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
“`
తెలుగు సమాజానికి తీరని లోటు: లోకేష్
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారని లోకేష్ కొనియాడారు.
““
రామోజీరావుకి అశ్రు నివాళి: బాలకృష్ణ
తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రామోజీ రావు మృతికి సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అశృనివాళి అర్పించారు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు రామోజీ మార్గదర్శిగా నిలిచారన్నారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్రసీమలోనూ అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ చూపిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రి నందమూరి తారక రామారావుతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ., ఆయన కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
“
రామోజీరావు మరణం తీవ్రంగా కలచివేసింది: యనమల రామకృష్ణుడు
నిజాలను ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేసేలా ఉండాలని తపించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని శాసనమండలి టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైన కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యం. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదురొడ్డి, రామోజీరావు ఈ స్థాయికి చేరారు. వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియాలని ఈనాడు అనే మీడియా వ్యవస్థను స్థాపించి.. ప్రజలకు తోడుగా నిలిచారు. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి లాంటి ఎన్నో వ్యాపార సంస్థల్ని స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్‌వర్క్ గా ఈటీవీని విస్తరింపచేశారు. తెలుగునాట ఎన్ని వార్తా పత్రికలొచ్చినా, ఎన్ని టీవీ ఛానళ్లు వచ్చినా.. నిజ నిర్ధారణ కోసం చూసే ఏకైక న్యూస్ నెట్‌వర్క్‌గా ఈనాడు, ఈటీవీని రూపుదిద్దారు. రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటని యనమల అన్నారు.
`
రామోజీ జీవితం అందరికీ ఆదర్శం: టీడీ జనార్ధన్
పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారన్నారు. ఈనాడు పత్రిక స్థాపన ద్వారా మీడియా రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. రామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.