- చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి
- ఏపీఎఫ్ఎసీ పునరుద్ధరణ ఆనందంగా ఉంది
- సినీ, నాటక, టీవీ రంగానికి కమిటీలో పెద్దపీట
- త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు
- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
- అట్టహాసంగా కార్యవర్గం ప్రమాణస్వీకారం
విజయవాడ(చైతన్యరథం): తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆదివారం విజయ వాడలో ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్య వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో జరగ్గా నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొ న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ఎసీ) ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ ఏర్పాటు చేశారన్నారు. రాజ ధాని లేని ఆంధ్రప్రదేశ్ గా ఉన్నా.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఎసీ చైర్మన్ భరత్ భూషణ్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఎఫ్ఎసీలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు, నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70 శాతం కలెక్షన్లు ఏపీ నుంచి వసూళ్లు అవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాల లో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలిపారు.
సింగిల్ విండో విధానంలో షూటింగ్ కు అనుమతులు
ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్లో సినిమా షూటింగ్కు బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నా యని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలకు సూచించారు. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా చాలా… ఈ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఒక సినిమా షూటిం గకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని చెప్పారు. ఎఫ్ఎసీని పూర్తిగా యాక్టివ్ చేసి సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్దపీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ వారి అనుభవంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల న్నారు. సినిమా ఎలా ఉందనే పరిస్థితి నుంచి సినిమాను బతికిం చాలనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కార్యాచరణతో చలన చిత్ర పరిశ్రమను అన్ని విధాలా కాపాడుకుం టామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకారం అందించాలని కోరుతున్నామని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే సినీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా మారిం దని.. ఏపీలో కూడా తెలుగు సినిమా షూటింగ్లు జరిగేలా ప్రోత్స హిస్తామన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల శివాజీ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్ గా పి. భరత్ భూషణ్, డైరెక్టర్లుగా మెహర్ రమేష్, సుమన్ తల్వార్, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై.ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల), వి.సముద్ర, కె.ఉమామహేశ్వరరావు (సీనియర్ జర్నలిస్ట్), మీర్, కందిమళ్ల సాంబశివరావు (చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత), ఎస్.వెంకట కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వరయాదవ్, డి. సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేశారు.













