- తయారుచేసిన చేనేత కళాకారుడు
- రామలింగ సత్యనారాయణను అభినందించిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): అశోక చక్రం సహా ఎటువంటి అతుకులులేని జాతీయ జెండాను 8ఇంటూ12 సైజులో తయారుచేసి పలు అంతర్జాతీయ రికార్డులు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ.. రాష్ట్ర విద్య, ఐటి మంత్రి లోకేష్‌ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెండ్ అవార్డు, భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించిన రామలింగ సత్యనారాయణ… తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6ఇంటూ12 జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8ఇంటూ12 జాతీయ జెండాలను తయారుచేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్పూర్తితో తాను తయారు చేసిన జాతీయజెండా ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరాలి, భారతదేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా మన ఆంధ్రప్రదేశ్‌కి గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేనేత జాతీయ జెండా (8ఇంటూ12). ఏకరీతిగా అశోక్ చక్రంలో దారాల అల్లిక చాలా కష్టమైనది. చిన్న పొరపాటు వచ్చినా మరలా మొదటి నుంచీ అల్లిక ప్రారంభించాలి. అందుకనే ఎక్కువ సమయం (సుమారు 6 నెలలు) తీసుకుంటుంది. అన్నీ సజావుగా సాగితే తొందరగా పూర్తి అవుతుందని అన్నారు. జాతీయ జెండాలోని అశోకచక్రం నేతలో రావాలంటే 1200 గళ్లు గ్రాఫ్ అవసరం. ఒక్క గడి తేడా లేకుండా, మూడు రంగుల దారాలు ఒకదానికి మరొకటి కలవకుండా లింక్ వేసుకుని నేయాల్సి ఉందని తెలిపారు. తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులులేని జాతీయ జెండా తయారుచేసిన రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు.














