- 19న ఎంపీపీలు.. 20న జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికలు
- 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లలో పరోక్ష ఎన్నికలు
- తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక..ఆ తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు 659 మండల ప్రజా పరిషత్‌ల (ఎంపీపీలు), 28 జిల్లా ప్రజా పరిషత్‌ల (జెడ్పీపీలు)లో పరోక్ష ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 19న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 5న పోలింగ్ నిర్వహించగా, తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఒకటి, ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్‌ను 6వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, ఎన్నికల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో అదే రోజు రీపోలింగ్ నిర్వహించారు. అనంతరం ఈనెల 7న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రక్రియ ముగియడంతో తాజాగా పరోక్ష ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అదే విధంగా జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, మరొకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. ఇందుకోసం సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు.
తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక
ప్రతి మండల పరిషత్‌లో ఒక కో-ఆప్టెడ్ సభ్యుడిని, ప్రతి జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ సభ్యులు మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందినవారై ఉండాలి. 1995 మార్చి 11న జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 131 ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు) మతపరమైన మైనారిటీలుగా గుర్తింపు పొందారు. తెలుగు మాతృభాష కాని ఇతర భాషలను మాతృభాషగా కలిగినవారిని భాషాపరమైన మైనారిటీలుగా పరిగణిస్తారు.
ఎన్నికల రోజున ఉదయం 10 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ‘చేతులెత్తడం’ పద్ధతి ద్వారానే ఎంపీపీ, జడ్పీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విప్‌కు లోబడే సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తే సభ్యత్వం రద్దు చేయనున్నారు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ నిబంధన వర్తించదు. అధ్యక్ష లేదా ఛైర్పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ఉపాధ్యక్ష లేదా వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగకపోతే.. ఆ వెంటనే జరిగే అధ్యక్ష, ఛైర్పర్సన్ ఎన్నికల సమావేశం రద్దవుతుంది.
కోరం లేకపోయినా లేదా ఇతర కారణాలతో ఎన్నిక వాయిదా పడితే.. మరుసటి రోజు (సెలవు దినమైనా సరే) మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ నిర్వహిస్తారు. ఎన్నికల సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానించనున్నారు. అయితే వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. పార్టీ విప్‌గా వ్యవహరించే వ్యక్తుల వివరాలను ఎన్నికకు ముందు రోజు ఉదయం 11 గంటలలోగా ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కేంద్రాల వద్ద బీఎనఎసఎస్ సెక్షన్ 163 కింద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజీకి అనుమతి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
14లోగా సమావేశాల నోటీసులు
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న ఎంపీపీలు, 20న జెడ్పీపీల్లో నిర్వహించనున్న పరోక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈనెల 14లోగా అందజేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణాత్మక విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.




















