- నేటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి
- ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండి
- వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దు
- ఆయిల్ కంపెనీలు పాలసీలతో ఇబ్బంది పెడితే ఎలా?
- టెలీకాన్ఫరెన్స్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
- సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్
అమరావతి (చైతన్య రథం): పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం… రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాలు తెలుసుకున్నారు. రిటైల్ ఔట్‌లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడంవల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో సాధారణగా పెట్రోల్ రోజుకు 6,330 కేఎల్ అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కసారిగా 34 శాతం డిమాండ్ పెరిగి 8,489 కేఎల్‌కు అమ్మకాలు చేరాయని, ఆదివారం కూడా సాధారణ డిమాండ్‌కన్నా 22 శాతం అధికంగా 7,750 కేఎల్ వినియోగం ఉందన్నారు. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాధారణగా డీజిల్ రోజుకు 9,048 కేఎల్ అమ్మకాలు జరిగేవని, అయితే శనివారం ఒక్కసారిగా 16 శాతం డిమాండ్ పెరిగి 10,556 కేఎల్‌కు అమ్మకాలు చేరాయని, ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 3 శాతం అధికంగా 9,392 కేఎల్ వినియోగం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనికితోడు నయారా, రిలయన్స్, జియోవంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీ బంకులకు సప్లయ్ నిలిపివేయడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయని జిల్లా కలెక్టర్లు వివరించారు.
అనుమతులపై పునరాలోచన చేస్తాం
మరోవైపు కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు తెలుపగా, ఎందుకు క్రెడిట్ నిలిపేశారని హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆయిల్ కంపెనీలకు తేల్చిచెప్పారు. గురువారమే సమస్యను గుర్తించామని అధికారులు చెప్పగా… మూడు రోజుల క్రితమే సమస్య గుర్తించినప్పుడు ఎందుకు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తరువాత, ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు నివేదికలు ఇవ్వడం కాదని… ఫలితాలు చూపించాలని సీఎం స్పష్టం చేశారు.
రైతులకు కూపన్ విధానం పరిశీలించండి
మరోవైపు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఒక్కసారిగా సమస్య తలెత్తడంపై విచారణ జరపాలని చెప్పారు. అగ్రి, ఆక్వాకల్చర్ అవసరాలు కూడా పెరిగాయని… వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశ పెట్టే ఆలోచన కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు చేయాలని సూచించారు. ప్రతీ బంక్ దగ్గర రెవెన్యూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, సీసీ కెమేరాల ద్వారా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడా బ్లాక్‌లో అమ్మకాలు జరగకూడదని చెప్పారు. సోమవారంనాటికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పారు.
















