తిరుమల (చైతన్య రథం): విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఈ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగంను శ్రీవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.















